అవగాహనతోనే రొమ్ము క్యాన్సర్ దూరం
1 min read– అవగాహన శిబిరంలో నగర మేయర్ బి.వై.రామయ్య పిలుపు
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: ప్రతి మహిళా ముందస్తు అవగాహనతో రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్తపడొచ్చని, నిర్లక్ష్యం వహించకుండా ప్రాథమిక దశలోనే వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవాలని కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్య సూచించారు. శనివారం స్థానిక కర్నూలు నగర పాలక కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో అక్టోబర్ నెల రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం గా పురస్కరించుకుని స్థానిక విశ్వభారతి సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నగర పాలక పరిధిలోని వార్డు సచివాలయాల ఏఎన్ఎం లు, మరియు మహిళా పారిశుద్ధ్య కార్మికులకు డాక్టర్ నిహారిక ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ బి.వై. రామయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుపేదలకు సత్వరంగా మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు అవసరమైనవన్ని నూతన పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను నిర్మించడమే కాకుండా వాటిల్లో ఆధునిక వైద్య పరికరాలను ఏర్పాటు చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. ప్రతి ఏఎన్ఎం కూడా మీ వార్డు సచివాలయ పరిధిలోని మహిళలకు రొమ్ము క్యాన్సర్ పై నివారణ, చికిత్సలపై తెలిపి వారిలో ఆత్మస్థైర్యం నింపే అవగాహన జాగృతిని విస్తృతం చేయాలని సూచించారు. నగర పాలక కమిషనర్ భార్గవ్ తేజ్ మాట్లాడుతూ…మన జీవనశైలిలో పలు జాగ్రత్తలతోనే ఆరోగ్యానికి పరిరక్షించుకోవచ్చని తెలిపారు. కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలోని ఏఎన్ఎంలు, మహిళా పారిశుద్ధ్య సిబ్బందికి క్యాన్సర్ పై అవగాహన కల్పించడానికి ముందుకు వచ్చిన విశ్వభారతి హాస్పిటల్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఏ క్యాన్సర్ అయినా ఆదిలోనే గుర్తించకపోవడం చివరి దశలో ఆస్పత్రిలకు వెళ్లడం వల్ల వ్యాధి ముదిరిపోయి నయం కాక మరణాలు సంభవిస్తున్నాయని వివరించారు. అంతకుముందు డాక్టర్ నిహారిక గారు…పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రొమ్ము క్యాన్సర్ యొక్క వ్యాధి లక్షణాలు, నివారణ, చేయించుకోవాల్సిన సర్జరీల వివరాలను క్షుణ్ణంగా వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఎస్వీ రమాదేవి, నగర పాలక ఆరోగ్యాధికారి విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు.