బ్రూసెల్లోసిస్.. మనుషులకు, పశువులకు ప్రమాదమే !
1 min readపల్లెవెలుగువెబ్ : బ్రూసెల్లోసిస్ అనేది పశు సంపదను నిర్వీర్యం చేసే ప్రమాదకరమైన వ్యాధి. బ్రూసిల్లా అబార్టస్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి పశువులకు సోకుతుంది. ఇది పశువుల నుంచి మనుషులకు కూడా సోకే అతి ప్రమాదకరమైన బ్యాక్టీరియా. దీనిని బ్యాంగ్స్ వ్యాధి అని కూడా పిలుస్తారు. ఇది అంటువ్యాధి. బ్రూసెల్లా సూక్ష్మజీవులు పశువుల జననేంద్రియాలను, పొదుగును ఆశించి వ్యాధిగ్రస్తం చేస్తాయి. ఈ వ్యాధి సోకితే చూడి పశువుల్లో గర్భస్రావాలు జరుగుతాయి. ఈ వ్యాధి సోకడం వల్ల కోడెలు, దున్నల్లో సంతానోత్పత్తి శక్తి తగ్గిపోతుంది. ఈ వ్యాధి పశువులకు చాలా కాలం నుంచి వస్తున్నప్పటికీ దీని నివారణకు వ్యాక్సిన్ ఇటీవలే కనుగొన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యాధి నివారణను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి దశల వారీగా దేశంలోని నాలుగు నెలల వయస్సు దాటి ఎనిమిది నెలల లోపు ఉన్న పెయ్య దూడలన్నింటికీ ఈ వ్యాక్సిన్ అందించే ప్రక్రియను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించాయి.