విజయవాడలో జరిగే 30 గంటల ఆందోళన జయప్రదం చేయండి
1 min read– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ట్రంలో కరువు విలాయతాండవం చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఇందుకు నిరసనగా సీపీఐ,రైతు సంఘం ఆధ్వర్యంలో 20,21 తేదీల్లో 30 గంటల ఆందోళనకు పిలుపునివ్వడం జరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. మంగళవారం సి ఆర్ భవన్ లో సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఏపీలో 18 జిల్లాల్లో 44 మండలాల్లో కరువు విలయతాండవం చేస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కరువు ప్రాంతాల్లో పర్యటించకపోగా, కరువు పై మాట్లాడేందుకు ఆయన ఇష్టపడకపోవడం దారుణం అన్నారు. కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం సెప్టెంబర్ 26న 230 కరువు తాలూకా లను ప్రకటించడమే కాకుండా, కేంద్ర కరువు బృందాలను పిలిపించి నివేదిక కూడా సమర్పించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 13 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి,చేతులు దులుపుకుందని, మంత్రులు,ప్రజాప్రతినిధులు కరువు ప్రాంతంలో పర్యటించలేదన్నారు. సీఎం క్యాబినెట్ సమావేశంలో కరువుపై ఎటువంటి సమీక్ష నిర్వహించకపోవడం దారుణమన్నారు. ఈ ఏడాది ఎల్ఎల్సె, హెచ్ఎల్సీ, కేసీ, శ్రీశైలంప్రాజెక్టు, నాగార్జునసాగర్లో నీరులేక వెలవెల పోతున్నాయన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువుపై ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టే వరకు రాష్ట్రస్థాయిలో ఉద్యమాలు చేసేందుకు సమాయత్తం కావాలన్నారు. తెలంగాణాలో ఎన్నికలలో లబ్దిపొందడానికి బీజేపీ క్రిష్ణాజలాల సమస్యను లేవనెత్తిందని ఏపీకి అన్యాయం చేయాలని చూస్తుందన్నారు. గత కర్నాటక ఎన్నికల సమయంలో కూడా ఎగువ ఉన్న అప్పరభద్రా ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి 3500 కోట్లు విడుదల చేసిందన్నారు. బీజేపీ చేస్తున్న విధానాల వలన ఏపీకి తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. నవంబరు 27, 28 తేదీలలో కేంద్ర కార్మికసంఘాలు, రైతుసంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో రెండురోజుల పాటు చేయు ఆందోళనలో రైతు, సంఘాలు, కార్మికసంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని, కరువు సహాయక చర్యలు చేపట్టాలని 20,21 తేదీలలో సీపీఐ, ఏపీ రైతుసంఘం ఆద్వర్యంలో చేపట్టిన 30 గంటల ఆందోళనకు 26 జిల్లాల నుండి సీపీఐ, ఏపీ రైతుసంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పీ.రామచంద్రయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, సహాయ కార్యదర్శులు ఎస్ఎన్ రసూల్, ఎస్ మునెప్ప, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. లెనిన్ బాబు, సీపీఐ నగర కార్యదర్శి పీ.రామకృష్ణారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.