అభ్యర్థులు ఎన్నికల నియామవళిని తప్పకుండా పాటించాలి
1 min read– అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి డిఆర్ఓ నాగేశ్వరరావు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: అభ్యర్థులు ఎన్నికల నియామవళిని తప్పకుండా పాటించాలని ఎమ్మెల్సీ అభ్యర్థులకు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి డిఆర్ఓ నాగేశ్వరరావు సూచించారు.మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హల్ లో ఎమ్మెల్సీ అభ్యర్థులతో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి డిఆర్ఓ నాగేశ్వర రావు సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి డిఆర్ఓ నాగేశ్వర రావు మాట్లాడుతూ నిన్నటితో అభ్యర్థుల నామినేషన్ విత్ డ్రాల్ ముగిసినందున, ఎన్నికల ఏజెంట్ ను నియమించుకోవాలన్నారు. అలాగే ఎక్కడైనా బ్యానర్స్ ప్రదర్శించాలన్న అనుమతి తప్పనిసరి తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు మరియు ప్రభుత్వ భవన సముదాయాల యందు ఎన్నికలకు సంబంధించిన పోస్టర్లను ప్రదర్శించకూడదన్నారు. అదే విధంగా ప్రైవేట్ భవనాల యందు ఉంచాలంటే తప్పకుండా వారి అనుమతి తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పంపిణీ చేసే పాంప్లెట్ నందు తప్పనిసరిగా ఎన్ని పాంప్లెట్స్ ప్రింట్ చేశారు, అదే విధంగా ప్రింటింగ్ యాజమాన్యం పేరు కూడా ప్రింట్ చేయడంతో పాటు పాంప్లెట్ కాఫీని కూడా తమకు ఇవ్వాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన ఖర్చు పెట్టిన మొత్తానికి సంబంధించి ఒక రిజిస్టర్ నిర్వహిస్తూ ప్రతి ఒక్క ఖర్చును అందులో నమోదు చేయాలన్నారు. అలాగే ఎన్నికల ఖర్చును రెండు రోజులకు ఒక సారి జిల్లా కో-ఆపరేటివ్ అధికారి రామాంజనేయులకు అందజేయాలని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి డిఆర్ఓ నాగేశ్వరరావు అభ్యర్థులకు తెలిపారు. అలాగే ఎన్నికల కోసం ఖర్చు పెట్టిన నగదు తమకు ఎక్కడి నుండి వచ్చింది, అదే విధంగా వారు చేసిన లావాదేవీల వివరాలు తప్పనిసరిగా అందజేయాలన్నారు. అనంతరం ఏ విధంగా ఖర్చు చెయ్యాలనేది డిసిఓ రామాంజనేయులు సవివరంగా అభ్యర్థులకు అవగాహన కల్పించారు.కార్యక్రమంలో ఏ.మధుసూదన్, వైఎస్ఆర్సిపి తరపున మద్దతుదారులు, భూమా వెంకటగోపాల్ రెడ్డి, ఇండిపెండెంట్, నార్ల మోహన్ రెడ్డి, ఇండిపెండెంట్, ఎన్నికల సూపరింటెండెంట్ మురళీ తదితరులు పాల్గొన్నారు.