అక్రమ అరెస్ట్ లతో ఉద్యమాన్ని ఆపలేరు : కె.ప్రకాష్ రావు
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు పి ఆర్ సి పై చేపట్టిన ఛలో విజయవాడ కార్యక్రమంను భగ్నం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఎదుర్కొని కార్యక్రమం విజయవంతం చేయడం జరిగిందన్నారు అప్తా రాష్ట్ర కార్యదర్శి కె.ప్రకాష్ రావు. అక్రమ అరెస్ట్ లతో ఉద్యమాలను ఆపాలనుకోవడం మూర్ఖత్వమని పేర్కొన్నారు. గురువారం చలో విజయవాడ కార్యక్రమానికి బయలుదేరుతారని ఉద్యోగ, ఉపాధ్యాయ నాయకులను ఆయా పోలీస్ స్టేషన్లలో అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ సిఐ కంబగిరి రాముడుతో అప్తా రాష్ట్ర కార్యదర్శి కె.ప్రకాష్ రావు చర్చించి ముందస్తు నోటిస్ తో అరెస్ట్ చేసిన విద్యార్ధి సంఘాల నాయకులు 30మందిని విడుదల చేయించారు. ఈ సందర్బంగా కె.ప్రకాష్ రావు మీడియాతో మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు సంయుక్తంగా నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం అణిచివేయాలని కుట్రతో పోలీసు వ్యవస్థను విస్తృతంగా ఉపయోగించిందని అన్నారు.గతంలో స్వతంత్ర ఉద్యమంను ఆపడానికి బ్రిటిష్ వారు ప్రయత్నించిన దాని కంటే మించి అతిగా ప్రవర్తించిందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా నియంత ధోరణితో విధుల్లో ఉన్న ఉపాధ్యాయ నాయకులను స్టేషన్ కు తరలించడం, బస్ లను అపి హంతకులను,దొంగలను తరలించినట్లు స్టేషన్లకు తరలించటం చాలా నీచమైన చర్య అన్నారు. కర్నూలు మండలం, వసంత నగర్ పాఠశాల నుండి అప్తా, ఫ్యాప్టో రాష్ట్ర కార్యదర్శి అయిన నన్ను కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ కు, ఓర్వకల్ మండలం ఉపాధ్యాయులను ఓర్వకల్ స్టేషన్ కు, ఇలా ప్రతి ప్రాంతంలో ఆయా స్థానిక స్టేషన్ లలో అరెస్ట్ చేసి నిర్భందించినట్లు చెప్పారు. ఎన్నో ఏళ్ల క్రితం పోరాటం ద్వారా ఉద్యోగులు సాధించుకున్న వాటిని ఒక జి.ఓతో తుడిచి పెడతామనుకుంటే.. తన వేలితో తన కన్ను పొడుచుకోవటమే అన్నారు. అక్రమ అరెస్టులకు భయపడకుండా.. ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయులు హక్కుల సాధనకు కృషి చేయాలని ఈ సందర్భంగా అప్తా రాష్ట్ర కార్యదర్శి కె.ప్రకాష్ రావు పిలుపునిచ్చారు.