వయోవృద్ధుల సంరక్షణలో ప్రత్యేక శ్రద్ధ అవసరం
1 min readప్రత్యేక వైద్యనిపుణులు, సేవలందించే సంస్థలకు పెరుగుతున్న ప్రాధాన్యం
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్: మధుమేహం, వయోభారంతో శరీరంలో వచ్చే మార్పులు, వినికిడిలోపం, చూపు మందగించడం వంటి సమస్యలు వృద్ధుల జీవనయానాన్ని సంక్లిష్టం చేస్తాయని, ఇలాంటి సమయంలో వారికి కుటుంబసభ్యుల చేయూతతోపాటు వైద్యసమస్యలను గుర్తించి చికిత్స అందించే జెరొంటాలజిస్ట్ (వృద్ధుల వైద్యనిపుణుల) అవసరం ఎంతో ఉందని సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, ప్రముఖ జెరియాట్రిక్ స్పెషలిస్ట్ డాక్టర్ వసంత్‌కుమార్ అభిప్రాయపడ్డారు. తీసుకునే ఆహారం, తేలికపాటి వ్యాయామాలు, ఆరోగ్యకరమైన జీవన విధానంతో.. ఈ సమస్యలను చాలావరకు నివారించవచ్చని ఆయన సూచించారు. సీనియర్ సిటిజన్ల ఆరోగ్య సంరక్షణలో ప్రివెంటివ్ మెడిసిన్, జెరొంటాలజిస్ట్‌లతోపాటు వారికి అన్ని రకాలుగా సేవలందించే సంస్థల ప్రాధాన్యం పెరుగుతోందన్నారు. వయోవృద్ధుల ఆలనాపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎల్డర్ ఎయిడ్ సంస్థ ఆదివారం బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్న ఉచ్ఛ్వాస్ ట్రాన్సిషన్ కేర్ సెంటర్‌లో నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరైన సీనియర్ సిటిజన్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వృద్ధుల అవసరాలను కనిపెట్టుకుని ఉండి వారి ఆరోగ్య సమస్యలకు మందులు అందించడం, ఆలనాపాలనా చూసుకోవడం అత్యవసరమని డాక్టర్ వసంత్ నొక్కిచెప్పారు. ఈ నేపథ్యంలో వృద్ధులు.. ముఖ్యంగా ఒంటరి వృద్ధుల సంరక్షణలో ఎల్డర్ ఎయిడ్ లాంటి సంస్థల అవసరం ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉచ్ఛ్వాస్ ట్రాన్సిషనల్ కేర్ ప్రతినిధులు సతీష్, పవన్, ఎల్డర్ ఎయిడ్ ప్రతినిధులు మందిరా జయసింహ తదితరులు పాల్గొన్నారు. దేశంలో వయోవృద్ధుల సంఖ్యతోపాటు ఉన్నత విద్యను అభ్యసించి, ఉద్యోగం, ఉపాధికోసం సుదూర ప్రాంతాలకు వెళ్లే యువత రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఒంటరిగా ఉంటున్న తల్లిదండ్రులకు వయసుమీద పడే కొద్దీ మధుమేహం, రక్తపోటు వంటి రుగ్మతలు, వయోభారంతో వచ్చే ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ సవాళ్లను దశాబ్దకాలం కిందటే గుర్తించిన ఎల్డర్ ఎయిడ్ సంస్థ 2015లో ఎల్డర్ ఎయిడ్ వెల్‌నెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించి వృద్ధుల సంరక్షణ బాధ్యతలో పాలుపంచుకుంంటోంది. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ, అవసరమైన పరీక్షలు చేయించడం, సాధ్యమైనంత వరకు ఇంటి వద్దనే చికిత్స అందించడం, ఇతర రకాలైన సేవలను సమర్థంగా అందిస్తోంది. తమవారు దగ్గర లేరనే లోటు రాకుండా చూసుకుంటోంది.