జీడిపప్పు ధరలు ఢమాల్ !
1 min readపల్లెవెలుగువెబ్: వ్యాపారుల అత్యాశను జీడిపప్పు జాడించి కొట్టింది. అనూహ్యంగా జీడిపప్పు ధరలు నేల చూపు చూస్తున్నాయి. పలాసలోనే ధరలు పతనం అయ్యాయి అంటే.. ఇతర చోట్ల పరిస్థితి ఊహించవచ్చు. కానీ ఇలా అయితే కష్టం అంటున్న వ్యాపారులు.. వారి మాట ఎలా ఉన్నా.. వినియోగ దారులు మాత్రం ఫుల్ హ్యాపీ. సాధారణంగా ఆగస్టు నెల నుంచి జనవరి నెల వరకు జీడి సీజన్. ఈ సమయంలోనే వినాయక చవితి నుంచి సంక్రాంతి వరకు వివిధ హిందూ పండగలు వస్తుంటాయి. ఈ సీజన్‌లోనే ఏడాది జీడిపప్పు అంతా వివిధ రాష్ట్రాలు, దేశాలకు తరలించి వ్యాపారులు సొమ్ము చేసుకుంటుంటారు. ఈ ఏడాది అనూహ్యంగా జీడి పప్పు ధరలు తగ్గుముఖం పట్టడంతో వ్యాపారులు దిగులు చెందుతున్నారు. జిల్లాలో 350కుపైగా జీడి పరిశ్రమలు ఉండగా.. ఒక్క పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లోనే 240కు పైగా ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి ఏటా సరాసరి ఒక్కో పరిశ్రమ 1,200 బస్తాల జీడి పిక్కలు పీలింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు పంపిస్తుంది. నాయక చవితి సమయంలో హైదరాబాద్, ముంబాయి, పూణె వంటి ప్రాంతాల్లో మన జీడిపప్పు ఎక్కువగా అమ్ముడవుతుంటుంది. విజయదశమికి బెంగాల్, బీహర్, అసోం, ఒడిసా వంటి ప్రాంతాలకు సరఫరా అవుతుంది. దీపావళికి గుజరాత్, గోవా, మధ్యప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ వంటి ప్రాంతాలకు ఎక్కువగా వెళ్తుంది. అందుకు తగిన ఆర్డర్లు వస్తున్నా ధర లేని కారణంగా ఉన్న నిల్వలు చెల్లించుకుంటున్నారే తప్ప.. అందుకు తగిన ఫలితం పొందలేకపోతున్నారు. గత ఏడాది ఈ సీజనులో కిలో జీడిపప్పు ధర 900 వరకు ఉంటే ప్రస్తుతం 650కు మించి వెళ్లడం లేదు. జీడి పిక్కలు బస్తా (80) కిలోలు 9,600 పలుకుతోంది. అధిక ధరలకు అమ్ముకోవచ్చని అనేకమంది వ్యాపారులు ముందస్తుగా జీడి పిక్కలు కొనుగోలు చేసి నిల్వ పెట్టుకున్నారు. ఒకే సంవత్సరంలో కొనుగోలు చేసిన పిక్కలు ఆ ఏడాదిలోనే పీలింగ్ చేయాల్సి ఉంది. దీంతో కిలో ధర 500 రూపాయలకు పడే ప్రమాదం ఉంది అంటున్నారు.