మల్లన్న భక్తులకు తిప్పలు
1 min readపల్లెవెలుగు వెబ్: దక్షిణకాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీశైలంలో వెలిసిన శ్రీ భ్రమరాంబమల్లికార్జున స్వామివార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు దేవస్థానం అధికారుల అనాలోచిత నిర్ణయాలతో అవస్థలు పడుతున్నారు. మల్లన్నను దర్శించుకునేందుకు భక్తులు సోమవారం భారీ సంఖ్యలో తరలివచ్చారు. కొబ్బరికాయ కౌంటరు ఒకటే ఉండటం వల్ల… ఒకరిపై ఒకరు తోసుకుంటూ కొబ్బరికాయలను కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదునుగా భావించిన కొందరు వ్యాపారస్తులు ఒక కొబ్బరికాయను 30 నుంచి రూ.50లకు విక్రయిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రథశాల పక్కనున్న కొబ్బరికాయ కౌంటర్ ఓపెన్ చేస్తే.. కొంతైనా ఇబ్బందులు తప్పేవని భక్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఆలయ అధికారులు స్పందించి శ్రీశైలంలో మౌలిక వసతులు ఏర్పాటు తోపాటు కొబ్బరికాయ కౌంటర్‌ను ఓపెన్ చేయాలని భక్తులు కోరుతున్నారు.