రైతుల పాదయాత్రను జయప్రదం చేయండి…
1 min read– హంద్రీ నీవా కు గుండ్లకొండ దగ్గర స్లూయిజ్ ఏర్పాటు చేసి కోటకొండ వరకు సాగునీరు ఇవ్వాలి
– మండలంలోని చెరువులన్నీ హంద్రీనీవా ద్వారా నీళ్లు నింపాలని ఈనెల 10, 11 తేదీలలో ,పి కోటకొండ గ్రామం నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు రైతుల పాదయాత్ర
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 10, 11 తేదీలలో హంద్రీనీవాకు గుండ్లకొండ దగ్గర స్లూయిస్ ఏర్పాటు చేసి గుండ్లకొండ నుండి కోటకొండ మాచాపురం గ్రామాల వరకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ తో రైతుల పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఈ పాదయాత్ర ను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీర శేఖర్,రైతు సంఘం మండల కార్యదర్శి సూరి లు మండల ప్రజానీకాన్ని కోరారు.బుధవారం నాడు స్థానిక అయ్యప్ప స్వామి గుడి ఆవరణలో లో పాదయాత్ర కరపత్రం ను విడుదల చేసి, ఈ సందర్భంగా వీరశేఖర్, సూరి లు మాట్లాడారు. దేవనకొండ మండలం నిత్యం పాలకుల నిర్లక్ష్యం కు, ప్రకృతి నిరాదరణకు గురవుతూ, పిలిస్తే పలికేదిగా కరువు ఉంటుందని గత రెండు సంవత్సరాలుగా కరువు చాయలు మండలంలో నెలకొన్నాయన్నారు.కరువు పరిష్కారంగా అనేక అవకాశాలు, వనరులు ఉన్నా పాలకుల, ప్రజా ప్రతినిధుల చిత్తశుద్ధి లోపం వలన కరువులు వస్తూనే ఉన్నాయని, ప్రతి కరువు అనేక మంది రైతులను మింగేస్తునే ఉందని అన్నారు. మండలంలో పై భాగంలో నిళ్ళు పోతున్నయని, ఓడిసిపట్టి మండలంలోని ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉందనీ అయినా అంగట్లో అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లు పాలకుల చిత్తశుద్ధి లోపం, బాధ్యతరాహిత్యం మండల రైతాంగానికి శాపంగా మారిందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో మండల ప్రజానీకం విస్తృత డిమాండ్ మేరకు గుండ్లకొండ దగ్గర హంద్రీ నీవా కాలువ కు స్లుయిజ్ ఏర్పాటు చేయడం ద్వారా మండలం లోని పైతట్టు గ్రామాలైన గుండ్లకొండ, గుడిమిరాళ్ళ, బంటుపల్లి, చేలిమి చెలిమిల, బేతపల్లి, బండపల్లి, కోటకొండ, అదే విధంగా వెంకటాపురం ,పల్లె దొడ్డి, మాచాపురం వరకు సాగునీరు ఇవ్వడానికి అవకాశం ఉంది. కావున వెంటనే ప్రభుత్వం గుండ్లకొండ దగ్గర స్లుయిజ్ ఏర్పాటు చేసి పై గ్రామాలకు సాగునీరు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తుందని చెప్పారు.అదేవిధంగా మండలంలోని రైతులకు ఆయా గ్రామాల్లో ఇప్పటికే సాగునీరుకు ఉపయోగపడుతున్న నేలతలమర్రి చెరువు, గుండ్లకొండ బానకుంట, గుడిమరాళ్ళ నిమ్మల బండ చెరువు, తుమ్మలచెరువు, బంటుపల్లి కుంట ,చెలిమి చెలిమిల చెరువు, బండపల్లి చెరువు ,కోటకొండ చిన్నోని చెరువు ,మాచాపురం పెద్ద చెరువు, మరియు బుర్రకుంట చెరువుకు హంద్రీ,నీవా ద్వారా నీళ్లు మళ్లించడం ద్వారా ఈ ప్రాంతం సస్యశ్యామలం కావడానికిఅవకాశం ఉందన్నారు. చెరువులు నింపడం ద్వారా భూగర్భ జలాలు పెరిగి రైతులకు మరింత ఉపయోగ కరంగా ఉంటుందని, కావున పైన మండలంలోని చెరువుల అన్నింటికి హంద్రీ నీవా ద్వార నీటిని మళ్లించి చెరువుల నింపాలనీ రైతుల పక్షాన కోరుతున్నామని వారు తెలిపారు. గుండ్లకొండ దగ్గర స్లుయిజ్ ఏర్పాటు చేసి గుండ్లకొండ నుండి కోటకొండ వరకు కాలువ ఏర్పాటు చేసి సాగునీరు ఇవ్వాలని మండలంలోని చెరువులన్నిటిని హంద్రీనీవా ద్వారా నీటిని నింపాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 10, 11 తేదీలలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కోటకొండ గ్రామం నుండి దేవనకొండ తాసిల్దార్ కార్యాలయం వరకు రైతులతో పాదయాత్ర చేపడుతున్నట్లు, పాదయాత్రను ఆయా గ్రామాల రైతులు, కూలీలు, ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని అందరూ కలిసి కట్టుగాా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, మన మండలంలోని ప్రతి ఎకరాకు సాగు నీరు వచ్చే విధంగా కృషి చేద్దామని, రైతుల పాదయాత్రకు అందరూ సంపూర్ణ సహకారం అందజేయాలని వారు కోరారు . ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి అశోక్ ,వ్యవసాయ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షులు యూసుఫ్ భాష, రైతు సంఘం నాయకులు ఓంకార్ ,సుంకన్న, యువజన సంఘం నాయకులు మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.