బలేరామలింగేశ్వరస్వామి మహాశివరాత్రి ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలి
1 min read
భక్తుల దర్శనానికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు పటిష్టంగా నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బలేరామలింగేశ్వరస్వామి మహాశివరాత్రి ఉత్సవాలను అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం ముసునూరు మండలం బలివే గ్రామంలోవేంచేసివున్న బలేరామలింగేశ్వరస్వామి మహాశివరాత్రి ఉత్సవాలు ఈనెల 25వ తేదీ నుండి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్న సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రామలింగేశ్వరస్వామి దేవస్ధానంలో వివిధ శాఖల అధికారులతో ఉత్సవ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా దైవదర్శనం కల్పించడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రూ.100/-లు, రూ.25/-లు మరియు ఉచిత దర్శనానికి ప్రత్యేకమైన క్యూలైన్ల ద్వారా దర్శన మార్గాలను ఏర్పాటు చేయాలని అన్నారు. స్నానఘట్టాల వద్ద జల్లుస్నానాలు ఏర్పాటు, పిండప్రధానాలు ప్రత్యేకమైన ప్రదేశంలో ఏర్పాటు, మహిళలకు ప్రత్యేకమైన బట్టలు మార్చుకునే గదులు ఏర్పాటు, ఘాట్ల వద్ద, దేవస్ధానంలోను, పరిసర ప్రాంతాల్లోను ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలని, ఘాట్ల వద్ద స్నానాలు ఆచరించే భక్తులకు భధ్రత ఏర్పాట్లో భాగంగా గజఈతగాళ్ల పర్యవేక్షణ ఉండాలని, స్నానఘట్టాల వద్ద దేవస్ధానంవద్ద, ఆర్ టిసి బస్సులు నిలుపు స్ధలం వద్ద, హెల్ఫ్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని దేవాలయంలోకి ప్రవేశించే మార్గం, వెలుపలికి వచ్చే మార్గం గుండా తప్పనిసరిగా బారికేడ్లు ఏర్పాటు చేయాలని భక్కులకు తెలిసేవిధంగా బోర్డులను డిస్ల్పే చేయాలని అన్నారు. దాతలు, ప్రభుత్వం శాఖల ద్వారా త్రాగునీరు, మజ్జిగ, పాలు ఇచ్చే ప్రదేశాలు ముందుగానే నిర్ణయించుకొని తోపులాటలు లేకుండా పంపిణీ చేయాలని తెలిపారు. భక్తులకు అత్యవసరంగా వైద్యసేవలు అందించడానికి రెండు మెడికల్ క్యాంపులు, రెండు అంబులెన్సులు, అత్యవసర సిబ్బంది, మందులు, డాక్టర్లు ఉండాలని అన్నారు. ఎలక్ట్రికల్, ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ల సమన్వయంతో జనరేటర్, విద్యుత్ అలంకరణలు నిరంతరం విద్యుత్ ఉండేలా చూచుకోవాలని సూచించారు. పారిశుధ్యం విషయంలో ప్రత్యేక మైన సిబ్బందిని ఇతర మండలాల నుంచి తీసుకువచ్చి ఎప్పటికప్పుడు స్నానఘాట్టాలు, దేవస్ధానం, ఉచిత ప్రసాదం అందించే ప్రదేశాల్లో ఎప్పటికప్పుడు పారిశుధ్యాన్ని మెరుగుపర్చుకుంటూ ఉండాలని తెలిపారు. రెవిన్యూ, పోలీస్ శాఖ, ఎండోమెంట్ వారితో కలిసి పకడ్బందీ బంధోబస్తు ఏర్పాటు చేసుకోవాలని ఎక్కడాకూడా ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పిండప్రధానాలు చేసే పురోహితులకు గుర్తింపు కార్డులు జారీచేయాలని బస్సుల పార్కింగ్ స్ధలం వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా కండీషన్ లో ఉన్న బస్సులను నడపాలని ఆర్ టిసి అధికారులకు కలెక్టర్ సూచించడం జరిగింది. దేవస్ధానం చుట్టుప్రక్కల అంతా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ను ఏర్పాటు చేసి కంట్రోల్ రూం ద్వారా ఎప్పటికప్పుడు భక్తులకు దిశా నిర్ధేశాలు తెలియజేయాలని చెప్పారు. అగ్నిమాపక శాఖ అధికారులు సంబంధిత అగ్నిమాపక వాహనం, ఫైర్ నిరోధక పరికరాలతో సిధ్దంగా ఉండాలని తెలిపారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని వారికి దైవదర్శనం మంచిగా జరిగేలాగా అధికారులందరూ పనిచేయాలని తెలిపారు. సమావేశంఅనంతరం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి భక్తులు స్నానం చేసే స్నానఘట్టాల ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించి జాగ్రత్తలపై తగుసూచనలు ఇవ్వడం జరిగింది. సమావేశంలో నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్, ఏలూరు జిల్లా ఎండోమెంట్ అసిస్టెంట్ కమీషనరు సిహెచ్ రంగారావు, దేవస్ధానం ఈవో పామర్తి సీతారామయ్య, తహశీల్దారు కె.రాజ్ కుమార్,యంపిడివో జి. రాణి, ఎస్సై ఎం.చిరంజీవి, సిఐ రామకృష్ణ, డిఎల్ పివో సుందరి, పిహెచ్ సి వైధ్యాధికారిణి డా.షకీలా ఇవాంజలిన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
