నాలుగు ఆర్ఓబీల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి
1 min read
ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త
ఎంపీ పుట్టా మహేష్ కుమార్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో నాలుగు చోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జిల (ఆర్ఓబి) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ జిల్లా వాసులకు శుభవార్త చెప్పారు. శుక్రవారం ఒక ప్రకటనలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. రైల్వే కి సంబంధించిన సమస్యలపై దిల్లీలో నిరంతరం తాను పర్యవేక్షిస్తున్నానని, ఫలితంగా మొదటి విడతగా నాలుగు ఆర్ఓబిల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపిందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల, కొల్లేరు పర్యాటక కేంద్రానికి రాకపోకలు సాగించడానికి వీలుగా, జాతీయ రహదారిపై వాహనాల రద్దీని నియంత్రించడానికి వీలుగా భీమడోలు వద్ద, అప్‌ల్యాండ్ నుండి డెల్టాకు రాకపోకల అవకాశం కల్పించడానికి స్థానిక ప్రజల కోరిక మేరకు కైకరం వద్ద, అప్‌ల్యాండ్ నుండి జి.కొత్తపల్లి మీదుగా నరసాపురం సముద్ర తీరానికి అనుసంధానించే చేబ్రోలు వద్ద, నల్లజెర్ల నుండి జాతీయ రహదారికి లింక్ రోడ్లను కలుపుతూ హార్టికల్చర్ విశ్వవిద్యాలయానికి వెళ్లే మార్గంలో ఉంగుటూరు వద్ద ఒకటి చొప్పున మొత్తం నాలుగు రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరు కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించగా, తాజాగా అనుమతి లభించిందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రైల్వే సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని అడిగిన వెంటనే తక్షణం స్పందిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఆరేడు నెలల్లో ఆర్ఓబిల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేర్కొన్నారు.ప్రస్తుతం మంజూరైన నాలుగు రైల్వే ఓవర్ బ్రిడ్జిలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే చేపడుతున్నందున రాష్ట్ర ప్రభుత్వంపై ఒక రూపాయి భారం పడదని, తద్వారా నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి కావడానికి అవకాశం ఉందని ఎంపీ తెలిపారు. వీటిని నిర్మాణం పూర్తయితే రైల్వే ట్రాక్ ల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నుంచి వాహనదారులకు, ప్రజలకు వెసులుబాటు లభిస్తుందని ఎంపీ వెల్లడించారు. రానున్న నాలుగేళ్లలో మరిన్ని ఆర్ఓబీల నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టేందుకు తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు.