PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉత్తమ సేవలు అందించిన గ్రామ పంచాయతీలకు ప్రశంసా పత్రాలు

1 min read

– గ్రామాల్లో సమతుల్య అభివృద్ధికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన ఎంతో అవసరం
– జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు దేశం లోనే ఆదర్శవంతంగా అభివృద్ధి చెందాలి
– జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా.జి.సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : గ్రామాల్లో సమతుల్య అభివృద్ధికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన ఎంతో అవసరం అని, వ్యవస్థ స్థిరీకరణ కోసం ఇవి తోడ్పడతాయని జిల్లా కలెక్టర్ డా.జి. సృజన పేర్కొన్నారు.సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ సేవలు అందించిన గ్రామ పంచాయతీలకు, పంచాయతీ సెక్రటరీ లకు జిల్లా కలెక్టర్ డాక్టర్.జి.సృజన, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందించి సత్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.జి.సృజన మాట్లాడుతూ సర్పంచులకు, ఇతర ప్రజాప్రతినిధులకు 30వ జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఒకనాడు గ్రామాలలో ఉన్న కుటుంబ పాలన స్థాయి నుండి ప్రజాస్వామ్య పద్ధతిలో గ్రామాల అభివృద్ధి జరిగే స్థాయికి చేరుకున్నందుకు మనం ఒకరికొకరు ధన్యవాదాలు తెలుపుకోవాలన్నారు. గ్రామ సర్పంచులు ధైర్యంగా వారు చేసిన అభివృద్ధి పనులను సమావేశాల్లో తెలిపే విధంగా ఆత్మస్థైర్యం పెంపొందించుకోవాలన్నారు. అభివృద్ధిని ఇంకా ఎక్కువ స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రభుత్వం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. పేదరికం లేని, మెరుగైన జీవనోపాధి గల పంచాయతీ, ఆరోగ్యకరమైన పంచాయితీ, బాలహిత పంచాయితీ, నీటి సమృద్ధి గల పంచాయతీ, పరిశుభ్రమైన హరిత పంచాయతీ, స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాల పంచాయతీ, సామాజికంగా సురక్షితమైన పంచాయితీ, సుపరిపాలన గల పంచాయతీ, మహిళ స్నేహపూర్వక పంచాయతీ అనే 9 అంశాల ఆధారంగా ఉత్తమ పంచాయతీల ఎంపిక జరిగిందని, ఉమ్మడి కర్నూలు జిల్లాకు 27 అవార్డులు రావడం జరిగిందని, వాటిలో నంద్యాల జిల్లాకు 16 రాగా, కర్నూలు జిల్లాకు 11 అవార్డులు రావడం జరిగిందని కలెక్టర్ వివరించారు.పేదరికం లేని, మెరుగైన జీవనోపాధి గల పంచాయతీ గురించి కలెక్టర్ వివరిస్తూ ఉపాధి హామీ పనులు, డిఆర్డిఏ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చేయూత,ఆసరా తదితర పథకాల ద్వారా ఎవరి మీద ఆధారపడకుండా జీవనోపాధి కల్పించుకోవడం జరుగుతోందని, ఇంకా ఏ విధంగా కార్యక్రమాలు చేపట్టాలి అనే దాని గురించి మనం అందరం ఆలోచించాలన్నారు.ఆరోగ్యకరమైన పంచాయతీ గ్రామ స్థాయిలో కుటుంబ వైద్య విధానంలో భాగంగా గ్రామాల్లో ఏఎన్ఎంలు పర్యటిస్తూ అవసరం ఉన్న వారికి ఆరోగ్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. వైద్యానికి సంబంధించి ఉన్న పథకాలను తెలుసుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అందులో ఎక్కువ శాతం సచివాలయ, వాలంటీర్ వ్యవస్థను మనం పూర్తి ఉపయోగించుకొని ఆరోగ్య సూత్రాలను ఇంకా మెరుగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అందులో పంచాయతీ భూమిక చాలా కీలకం అని తెలిపారు.చైల్డ్ ఫ్రెండ్లీ మరియు మహిళా స్నేహపూర్వక పంచాయతీకి సంబంధించి 2023 సంవత్సరంలో కూడా మనం బాల్యవివాహాల గురించి వాటిని ఎలా ఆపాలి అనే దాని గురించి మాట్లాడుకోవలసి వస్తుందన్నారు.. దైవాజ్ఞగా ఒక మహిళా కలెక్టర్ గా నన్ను జిల్లాకు పంపడం నా అదృష్టంగా భావిస్తూ, వాటి నిర్మూలనకు పూర్తిస్థాయిలో బాల్య వివాహాలు లేని సమాజం, మహిళలో రక్తహీనత లేకుండా, మహిళ సాధికారత కోసం చేసే కృషిలో మీ అందరి సహాయ సహకారాలు కావాలన్నారు. ఇక కర్నూలు జిల్లాలో బాల్య వివాహాల గురించి మనం ఇక మాట్లాడు కోకూడదన్నారు.., 13 సం.లోపల బాల్య వివాహాలు చేయాల్సిన అవసరం ఎందుకు, కుటుంబాలకు అంత బలహీనత ఏర్పడింది అని ఆలోచించి, ఆడపిల్లల్ని చదువు పట్ల ప్రోత్సహిస్తూ వారే కుటుంబానికి అండగా వారి కాళ్ళ మీద వారు నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉందని దానికి పంచాయతీలు కూడా బాధ్యత తీసుకొని చట్టవ్యతిరేక కార్యక్రమాలు జరగనివ్వకుండా చూడాలన్నారు.. జరుగుతుందని తెలిసి కూడా ఆపలేక పోవడం తప్పుగానే పరిగణించాలన్నారు. వీటి అన్నిటిలో మీ సహాయ సహకారాలు ఉంటాయని కోరుకుంటున్నానన్నారు. మిగిలిన లక్ష్యాలు సాధించి నీటి వసతులు కలిగిన పంచాయతీలు, పరిశుభ్రమైన హరిత పంచాయతీలు మన జీవన విధానాన్ని తెలియజేసే ఈ అన్ని లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో పంచాయతీల భూమిక ఎంతైనా ఉంటుందన్నారు. గాంధీజీ గారు గ్రామ స్వరాజ్యన్ని సాధించడానికి, దేశాభివృద్ధికి పల్లెలే పట్టు కొమ్మలు అన్న సూక్తిని మననం చేసుకుంటూ, 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు కల్పించిన ప్రతిపత్తిని ముందుకు తీసుకెళ్లడంతో పాటు కేవలం నిధుల తోనే కాకుండా ఉన్న వనరులను ఏ విధంగా ఉపయోగించాలనే ప్రాసెసింగ్ ఇంజనీరింగ్ ద్వారా మనం సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అదే విధంగా 9 లక్ష్యాలలో ఉత్తమ సేవలు అందించిన గ్రామ పంచాయతీలను అభినందిస్తూ మిగిలిన గ్రామ పంచాయతీలు కూడా స్ఫూర్తిగా తీసుకొని వచ్చే సంవత్సరంలో దేశానికే ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ ఆకాక్షించారు.జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో సాధించిన అభివృద్ధికి సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు చేసిన కృషిని మనం అభినందించుకోవడం జరుగుతుందన్నారు. మనకు మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ మనకు గ్రామాల్లో ఉందన్నారు, గ్రామ స్థాయిలో సర్పంచు, మండల వ్యవస్థ, జిల్లా పరిషత్ వ్యవస్థలు ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తొమ్మిది అంశాలలో ఉత్తమ సేవలు అందించిన గ్రామ పంచాయతీలకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఒక్కొక్క కమిటీ ఉంటుందన్నారు. జిల్లా స్థాయిలో అభివృధ్ధి సాధించిన గ్రామ పంచాయతీలకు సన్మానించుకోవడం జరుగుతుందన్నారు. అందుకు గాను గ్రామ సర్పంచ్, పంచాయతీ సెక్రటరీలను అభినందించుకోవడం జరిగిందన్నారు. ఈ లక్ష్యాలలో 6 వాటికి సంబంధించి వర్క్ షాప్స్ మీద కూడా హాజరు అవ్వడం జరిగిందన్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం సర్పంచులు కేవలం నిధులతోనే కాక అన్ని అంశాల మీద దృష్టి పెట్టాలన్నారు. పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలలో అందరూ సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు కృషి చేయడం జరిగిందన్నారు. అదే విధంగా గడప గడపకు వెళ్ళినప్పుడు చాలా శాతం వృద్ధులకు ఐరిస్ పడటం లేదని అందుకుగాను పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. గ్రామాలలో అర్హులైన ప్రతి పేద వాడికి పెన్షన్ మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా గ్రామ అభివృద్ధికి సర్పంచులు కృషి చేస్తూ చెత్త పన్నుకు సంబంధించి పంచాయతీ సెక్రటరీల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని, కేవలం మనం నగర పరిశుభ్రతలో వారిని కూడా భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతోనే సదరు పన్నును వసూలు చేయడం జరుగుతుందన్నారు.9 థీమ్స్ లో ఉత్తమ ప్రతి కనబరిచి 11 గ్రామ పంచాయతీల వివరాలుపేదరికం లేని, మెరుగైన జీవనోపాధి గల పంచాయతీ – పెద్ద కడుబూరు మండలం, తారాపురం గ్రామపంచాయతీఆరోగ్యకరమైన పంచాయితీ – నందవరం మండలం, హాలహార్వి గ్రామపంచాయతీబాలహిత పంచాయితీ – మంత్రాలయం మండలం రాంపురం గ్రామపంచాయతీ, తుగ్గలి మండలం ఎల్లమ్మ గుంట తాండ గ్రామపంచాయతీపరిశుభ్రమైన హరిత పంచాయతీ – ఆదోని మండలం, పాండవ గళ్ళు గ్రామపంచాయతీస్వయం సమృద్ధి మౌలిక సదుపాయాల పంచాయతీ – ఆదోని మండలం, మంత్రికి గ్రామ పంచాయతీ, కోసిగి మండలం సాతనూరు గ్రామపంచాయతీ. సామాజికంగా సురక్షితమైన పంచాయితీ – ఆదోని మండలం మందగేరి గ్రామ పంచాయతీ (రాష్ట్ర స్థాయికి కూడా ఎంపికైన గ్రామ పంచాయతీ)సుపరిపాలన గల పంచాయతీ – ఆదోని మండలం విరూపాపురం గ్రామపంచాయతీమహిళ స్నేహపూర్వక పంచాయతీ – పెద్దకడుబూరు మండలం, మేకడోనా గ్రామ పంచాయతీ, ఓర్వకల్లు మండలం గుడుంబాయి తాండ గ్రామపంచాయతీపై తెల్పిన పంచాయతీల గ్రామ సర్పంచులను, పంచాయతీ సెక్రటరీలను జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి చేతుల మీదుగా వారిని శాలువా, ప్రశంసా పత్రంతో సత్కరించారు.హౌస్ టాక్స్ కలెక్షన్ ను వంద శాతం వసూలు చేసిన డిఎల్పిఓ తిమ్మక్క, శ్రీకాంత్ చౌదరిలను శాలువతో సత్కరించారు.అనంతరం జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్ డా.జి. సృజనను శాలువతో సత్కరించారు.కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, డిపిఓ నాగరాజు నాయుడు, గ్రామాల సర్పంచులు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.

About Author