పట్టణంలో కనిపించని చలివేంద్రాలు
1 min read– చలువ పందిళ్ల జాడే లేదు…
– బస్ స్టాప్ లో ఎండ వేడికి ప్రయాణికుల అవస్థలు..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: మార్చి మొదటి వారంలోనే బానుడు భగభగ మంటూ సెగలు పుట్టిస్తున్నాడు. ఎండలు దంచి కొడుతుండడంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. బయటకు వెళ్లడానికి కూడా ప్రజలు భయపడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి భానుడి ప్రతాపం మొదలవుతుంది. గత మూడేళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఎండలు మార్చి మొదటి వారంలో పెరిగిపోవడంతో ఇంకా రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు భయపడుతున్నారు.
కనిపించని చలివేంద్రాలు
నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలో చలివేంద్రాలు ,చలువ పందిళ్లు ఎక్కడా కనిపించడం లేదు. ఒక పక్క రోజురోజుకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోపక్క ప్రజలు పగటి వేళ బయట తిరగాలి అంటేనే భయపడుతున్నారు. రోడ్డు మీదకు వస్తే క్షణాల్లో దాహం. గతంలో మున్సిపాలిటీ లోని ప్రభుత్వ కార్యాలయాలు ఎంపీడీఓ, తహశీల్దార్ కార్యాలయాల ఎదుట , పట్టణంలో ప్రధాన కూడళ్లు పటేల్ సెంటర్, అల్లూరు రోడ్డు, మిడుతూరు రోడ్డు ,ఆర్టీసీ బస్టాండ్ వద్ద, ప్రభుత్వ అధికారులు, పాలకులు, స్వచ్ఛంద సంస్థలు మంచినీటి చలివేంద్రాలు ఏర్పాటు చేసేవారు. కానీ ఈ సంవత్సరం ఎక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయలేదు. చిన్న పిల్లలతో బయటకు వచ్చే వాళ్ళు తప్పనిసరిగా వాటర్ బాటిల్ తో వస్తున్నారు. వివిధ పనుల నిమిత్తం మున్సిపాలిటీ, ఎంపీడీఓ, తహశీల్దార్,వ్యవసాయ కార్యాలయాలకు వచ్చే ప్రజలు దాహంతో తల్లడిల్లిపోతున్నారు. అలాగే పట్టణంలోని వివిధ బస్ స్టాప్ ల వద్ద ప్రయాణికుల సౌకర్యం కోసం ఆర్టీసీ అధికారులు చలువ పందిళ్లు ఏర్పాటు చేయాల్సి ఉంది.కానీ ఇప్పటివరకు ఎక్కడ చలువ పందిళ్లు ఏర్పాటు చేయలేదు. ముఖ్యంగా ఆత్మకూరు బస్ స్టాప్ వద్ద ప్రయాణికులు ఎండ వేడికి నిల్చోలేక పోతున్నారు.ఈ నెల 29 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన తర్తూరు శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి జాతర ప్రారంభమవుతుంది.
ప్రజల దాహార్తిని తీర్చాలి..ఇబ్రహీం ఖాన్. పట్టణ వాసి.
ఎక్కువగా జనసంచారం ఉండే ప్రదేశాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి దాహార్తిని తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో ఆయా శాఖల అధికారులు చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృషి చేశారు. ఈ ఏడాది కూడా ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజా ప్రతినిధులు, అధికారులు చలివేంద్రాలను , చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.