చండ్ర పుల్లారెడ్డి స్తూపం విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలి
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: స్వాతంత్ర సమరయోధుడు నందికొట్కూరు తొలి శాసనసభ్యులు తొలితరం విప్లవ కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి జ్ఞాపకార్థం నందికొట్కూరు పట్టణంలో స్థూపం అలాగే విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలని సిపిఐ(యం ఎల్ )న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు సోమవారం నందికొట్కూరు శాసనసభ్యులు తోగురు ఆర్ధర్ కు వినతిపత్రం అందజేశారు. నందికొట్కూరు ప్రజల కోరిక మేరకు స్థలాన్ని మంజూరు చేయాలని కోరారు. ఎమ్మెల్యే ఆర్థర్ స్పందిస్తూ స్థలం ఎంపిక కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారని జిల్లా కార్యదర్శి నరసింహులు తెలిపారు. స్వాతంత్ర్య అనంతరం ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంగా అసెంబ్లీగా ఉన్నప్పుడు 1952లో నందికొట్కూరు తొలి శాసనసభ్యుడిగా కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారన్నారు. మద్రాస్ అసెంబ్లీలో రాయలసీమ వెనుకబాటుతనాన్ని కరువు కథల్ని కన్నీటి కష్టాల్ని అసెంబ్లీలో వినిపించారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు అభివృద్ధి కొరకు తన గళాన్ని గట్టిగా వినిపించిన కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి తుది శ్వాస వదిలేవరకు నిత్యం ప్రజల కొరకు,ప్రజా సమస్యల పరిష్కారం కొరకు పరితపించి నిత్యం పోరాటం చేసేవారు అలాంటి ప్రజల పక్షపాతిని నందికొట్కూరు ప్రజలు మరవకూడదని భావితరాలకు ఆయన స్ఫూర్తి కావాలని, కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి స్తూపం విజ్ఞాన కేంద్రం ఏర్పాటు కొరకు మున్సిపల్ కౌన్సిల్ తీర్మానించి స్థలం కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు జిల్లా నాయకులు ప్రేమరాజు, పిడీఎస్ యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జునైద్ బాషా,ఆర్.రామాంజనేయులు, ఆర్.శివ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.