చేతకాకపోతే వెళ్లిపోండి.. ఎస్‌ఈసీపై చంద్రబాబు ఫైర్
1 min read
పల్లెవెలుగువెబ్: వైసీపీ సర్కార్, ఎన్నికల సంఘంపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. కుప్పంలో దొంగ ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు. పవిత్రమైన ఎన్నికల వ్యవస్థను భ్రష్టుపట్టించారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలపై లాఠీచార్జీ చేయడం దారుణమని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ నేతలు చరిత్ర హీనులుగా నిలిచిపోతారని… టీడీపీ నేతలను నిర్బంధించి, ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారన్నారు. పోలీసులు సైతం దొంగలకు వంత పాడుతున్నారన్నారని విమర్శించారు. ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓట్లు వేసేందుకు వచ్చినవారిని కుప్పం ఎలా రానిచ్చారని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల సంఘం ఏం చేస్తోందని చంద్రబాబు ప్రశ్నించారు.
వైసీపీ అరాచకపాలనకు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉందన్నారు. పెరిగిన ధరలు, పెంచిన పన్నులు, అధ్వాన రోడ్లుతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని.. ఏదో ఒక రోజు ఎదురు తిరిగే పరిస్థితి వస్తుందన్నారు. కుప్పంలో ఇంత దారుణంగా ఎన్నికల నిర్వహణను తాను ఎన్నడూ చూడలేదని.. అసలు ఎన్నికల కమిషన్ ఉందా.. చేతకాక పోతే వెళ్లిపోండి అంటూ చంద్రబాబు ఘాటుగా స్పందించారు.