PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆదోనిలో మార్పు..తథ్యం..!

1 min read

ఊరు మారాలంటే… ఎమ్మెల్యే మారాలి…

  • ఎమ్మెల్యేగా సాయిప్రసాద్​ రెడ్డి పదైదేళ్లు పాలన..
  • రోడ్ల విస్తరణ చేయలేదు…అభివృద్ధి జాడే లేదు…
  • యువతకు ఉపాధి లేదు…
  • ఒకప్పుడు సెకండ్​ బాంబే…. ఇప్పుడు ముంబాయికే వలసలు…
  • కూటమి ఆదోని అసెంబ్లీ అభ్యర్థి డా. పార్థసారధి

కర్నూలు, పల్లెవెలుగు: రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు… వచ్చేది కూటమి ప్రభుత్వమేనని, అది ఆదోని నుంచే మార్పు తథ్యమన్నారు కూటమి అసెంబ్లీ అభ్యర్థి డా. పార్థసారధి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో దేశం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోందని ప్రపంచ దేశాల అధినేతలు మెచ్చుకున్నారన్నారు. బుధవారం కర్నూలు నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూటమి  ఆదోని అసెంబ్లీ అభ్యర్థి డా. పార్థసారధి, రాయలసీమ రీజనల్​ కో ఆర్డినేటర్​ సావిత్రి, జిల్లా మాజీ అధ్యక్షుడు రామస్వామి, ఆదోని సీనియర్​ నాయకుడు విట్టారమేష్​ పాల్గొన్నారు.

భూ కబ్జాలపై…చర్చకు సిద్ధమా….:

 ఈ సందర్భంగా డా. పార్థసారధి మాట్లాడుతూ ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డి పదైదేళ్లు  ఎమ్మెల్యేగా ఉన్నారని, కానీ పట్టణంలో ఎక్కడా రోడ్ల , కాల్వలు వేయలేదన్నారు. పట్టణం నడిబొడ్డున రోడ్ల విస్తరణ కూడా చేయలేదన్నారు. భూములు కబ్జా చేయడంలో ఆరితేరిన ఎమ్మెల్యే సాయిప్రసాద్​ రెడ్డి…. ఎమ్మెల్యే పదవికి అనర్హుడన్నారు. రేషన్​ బియ్యం, ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలించడం… మద్యం అమ్మకాలు, మట్కా, పేకాట… ఇలా ఎన్నో అరాచకాలు పట్టణ ప్రజలు భరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఖాళీ భూమి కనిపిస్తే చాలు… ఎమ్మెల్యే… ఆయన అనుచరులు కబ్జా చేస్తూ దోచుకు తిన్నారని, దీనిపై చర్చకు సిద్ధమా అని ఎమ్మెల్యే సాయిప్రసాద్​ రెడ్డికి సవాల్​ విసిరారు. కులాల వారీగా విభజించడం… మతాల మధ్య చిచ్చు పెట్టి … పబ్బం గడుపుకుంటున్న ఎమ్మెల్యే సాయిప్రసాద్​ రెడ్డిని గద్దెదించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

 ఒకప్పుడు సెకండ్​ బాంబే….:

బంగారం, పత్తి, బట్టల వ్యాపారంలో సెకండ్​ బాంబేగా పేరుగాంచిన ఆదోని…. ప్రస్తుతం ఉపాధి లేక కూలీలు ముంబాయికే వలసలు వెళ్తున్నారు.  ఉన్న మూడు పరిశ్రమలు  మూతపడ్డాయి. యువతకు ఉపాధి లేదు. చిన్న చిన్న కూలీ పనులు చేసుకుంటూ.. తాత్కాలికంగా కడుపునింపుకుంటున్న యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలన ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్నారని, వారి అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నాను. తనను గెలిపిస్తే యువతను ఉపాధి సృష్టికర్తలుగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా డా. పార్థసారధి హామీ ఇచ్చారు.

ఊరు మారాలంటే… ఎమ్మెల్యే మారాలి..:

 ఆదోని నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో రోడ్లు, మురుగు కాల్వలు లేవు. ఐదేళ్లుగా రోడ్లు, కాల్వలకు మంజూరైన కేంద్రం, రాష్ట్ర నిధులు దాదాపు రూ. 400 కోట్లను ఎమ్మెల్యే సాయిప్రసాద్​ రెడ్డి, తన అనుచరగణం దిగమింగారు. కనీసం వీధిలైట్లు కూడా నోచుకోని గ్రామాలు ఉన్నాయంటే…. అవినీతి ఏ స్థాయిలో ఉందో తెలుస్తోందన్నారు.  కాబట్టి ఊరు మారాలంటే… ఎమ్మెల్యే మారాలి అనే నినాదంతో గ్రామాల్లో ప్రచారం చేస్తున్నామని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి వెల్లడించారు. అవినీతి పరులకు… కబ్జాదారులకు భయపడాల్సిన అవసరం లేదని, తాను ఆదోనిలోనే ఉంటానని యువతకు, ప్రజలకు భరోసా ఇచ్చారు డా. పార్థసారధి.

కూటమిగానే.. ప్రచారం…:

 ఆదోనిలో (బీజేపీ–జనసేన– టీడీపీ) కలిసికట్టుగా ప్రచారం చేస్తున్నామని,  కూటమి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని సంతోషం వ్యక్తం చేశారు అభ్యర్థి డా. పార్థసారధి. మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, జనసేన నాయకుడు మల్లప్ప, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కనిగిరి నీలకంఠం సారథ్యంలో ప్రచారం ముమ్మరం చేశామన్నారు.  తనను గెలిపిస్తే… ఆదోనిని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా అభ్యర్థి డా. పార్థసారధి ప్రజలకు హామీ ఇచ్చారు.

About Author