బోగస్ ఓట్లకు చెక్.. సంస్కరణలకు గ్రీన్ సిగ్నల్
1 min readపల్లెవెలుగు వెబ్: కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంస్కరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బోగస్ ఓట్లకు చెక్ పెట్టి.. పక్కాగా ఓటర్ల జాబితా రూపొందించేందుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఎన్నికల సంస్కరణల బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఓటర్ ఐడీతో ఆధార్‌ను అనుసంధానం చేయాలని, చెల్లింపు వార్తలను నేరంగా పరిగణించాలని, తప్పుడు అఫిడవిట్ సమర్పిస్తే రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించాలని.. ఇలా దాదాపు 40 సవరణలను ప్రతిపాదించింది. కాగా, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన సవరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం. పాన్-ఆధార్ అనుసంధానం లాగానే ఇకపై ఓటర్ ఐడీకి ఆధార్ అనుసంధానం చేయడానికి కూడా అనుమతి ఇవ్వనున్నారు.