పార్కులో ప్రసవం.. డాక్టరుగా మారిన పీఈటీ
1 min readమైసూరులో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పిల్లలకు ఫిజికల్ ఎడ్యుకేషన్ చెప్పే పీఈటీ .. డాక్టరుగా మారాల్సి వచ్చింది. హాస్పటల్ లో కావాల్సిన కాన్పు.. పార్కులో అయ్యింది. తల్లీ బిడ్డ క్షేమంగా ఇంటికెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని కొడుగు జిల్లా అర్వేతోక్లు గ్రామానికి చెందిన గిరిజన మహిళ మల్లిగె…ఉపాధి నిమిత్తం మైసూరు వచ్చారు. గర్భిణిగా ఉన్న ఆమె.. తన ఇద్దరు పిల్లలతో కలిసి మినీ విధానసౌధ వైపుగా వచ్చారు. ఇంతలోనే పురిటినొప్పులు వచ్చాయి. ఇది గమనించిన పీఈటీ శోభకుమారి… మల్లిగెను పక్కనే ఉన్న పార్కులోకి తీసుకెళ్లింది. కార్తీక్ అనే మరో యువకుడి సాయం కోరింది. అంబులెన్స్ కు కూడ ఫోన్ చేశారు. అయితే.. మల్లిగె కు పురటినొప్పులు తీవ్రమవడంతో… కార్తీక్ ముంబయిలోని తనకు తెలిసిన ఆయుర్వేద డాక్టర్ సలహా తీసుకున్నారు. ఫోన్ లోనే ఆ డాక్టర్ సలహాలు, సూచనలు ఇచ్చారు. డాక్టరు సలహా ప్రకారం పీఈటీ శోభాకుమారి ప్రసవం చేశారు. అనంతరం అంబులెన్స్ రావడంతో.. ఆస్పత్రికి తరలించారు. తల్లి బిడ్డను పరీక్షించిన డాక్టర్లు క్షేమంగా ఉన్నారని చెప్పారు. ఆపదలో ఉన్న మహిళను ఆదుకున్న పీఈటీ శోభకుమారి, కార్తీక్ లను పలువురు అభినందించారు.