వెంకయ్య నాయుడు పర్యటన పై చైనా అభ్యంతరం !
1 min readపల్లెవెలుగు వెబ్: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించడం పట్ల చైనా అభ్యంతరం తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్ లో భాగమని, అరుణాచల్ ప్రదేశ్ ను భారత్ లో అంతర్భాగంగా గుర్తించడంలేదని చైనా తెలిపింది. భారత్ ఏకపక్షంగా, బలవంతంగా, చట్టవిరుద్దంగా అరుణాచల్ ప్రదేశ్ ను తమ దేశంలో కలుపుకుందని ఆరోపించింది. భారత్, చైనాల మధ్య సంబంధాలు దెబ్బతినేలా, సరిహద్దు వివాదాలు పెరిగేలా వ్యవహరించొద్దని చైనా హితవు పలికింది. అయితే.. చైనా వాదనను భారత్ కొట్టిపారేసింది. అరుణాచల్ ప్రదేశ్ ముమ్మాటికి భారత్ లో అంతర్భాగమని నొక్కివక్కాణించింది. భారత నేతలు అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించడం పట్ల చైనా అభ్యంతరం వ్యక్తం చేయడం అర్థంపర్థంలేని పనిగా అభివర్ణించింది. ఇతర రాష్ట్రాల్లో పర్యటించినట్టే.. అరుణాచల్ ప్రేదశ్ లోనూ పర్యటిస్తారని స్పష్టం చేసింది.