సరైన నాయకుడిని ఎన్నుకోండి… టిజి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: సరైన నాయకుడు పరిపాలించకపోతే ప్రజలకు ఇబ్బందులే ఉంటాయని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జీ టిజి భరత్ అన్నారు. గురువారం నగరంలోని 16వ వార్డు పరిధిలోని స్వామిరెడ్డి నగర్లో ఆయన భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో ఇంటింటికి తిరిగి ప్రజలను కలిశారు. వీధుల్లో తిరిగి మహిళలు, వృద్ధులు, యువకులను కలిసి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య సమస్యలు, ఇళ్ల పట్టాల సమస్యలు, త్రాగునీటి ఇబ్బందుల గురించి ప్రజలు టిజి భరత్ తో మొరపెట్టుకున్నారు. అనంతరం టిజి భరత్ ప్రజలతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు అంతా మంచే జరుగుతుందని చెప్పారు. సరైన నాయకత్వం ఉంటే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటాడని వివరించారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు ప్రజలకు సమస్యలు లేకుండా పరిపాలన అందిస్తానని చెప్పారు. వార్డుల్లో సమస్యలు తీరుస్తానని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని భరత్ కోరారు. వార్డుల్లో మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం దారుణమన్నారు. అనంతరం గౌరి గోపాల్ హాస్పిటల్ లో టీజీవి సంస్థల ఆధ్వర్యంలో చేపిస్తున్న ఉచిత వైద్య పరీక్షల కరపత్రాలు అందించి గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఉచిత వైద్య పరీక్షల వల్ల పలువురి అనారోగ్య సమస్యలు ముందుగా బయటపడినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంఛార్జీ రామాంజనేయులు, బాబ్జి, క్రాంతి కిషోర్, చాంద్, శేఖర్, బాషా, సూరి, కోట్ల, మురళి, తదితర నేతలు పాల్గొన్నారు.