కర్నూలు నగరం…ఆధ్యాత్మిక సమ్మిళితం
1 min read– రంజాన్ ప్రత్యేక ప్రార్థనలకు ఈద్గాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం
– నగర మేయర్ బీవై రామయ్య
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: కర్నూలు నగరం మొదటి నుంచి మతసమరస్యానికి ప్రతీక అని, ఇక్కడ అన్ని మతాల వారు తమ తమ ఆధ్యాత్మిక భావం ఉట్టిపడే విధంగా ఉత్సవాలు, ప్రార్ధనలు చేసుకోవడం ఆనవాయితీ అని పేర్కొన్నారు నగర మేయర్ బీవై రామయ్య. పవిత్ర రంజాన్ పర్వదినం సమీపిస్తున్న దృష్ట్యా శనివారం నగరంలోని మెడికవర్ హాస్పిటల్ వద్ద ఉన్న పాత ఈద్గా ప్రాంతం, అలాగే సంతోష్ నగర్ వద్ద ఉన్న ఈద్గాలను నగర మేయర్ బి.వై.రామయ్య, కర్నూలు నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ పరిశీలించారు. నగర మేయర్ బి.వై.రామయ్య మాట్లాడుతూ… ఈద్గాల వద్ద పారిశుద్ధ్య పనులు, తాగునీరు, టెంట్లు తదితర వసతులు ఏర్పాటు చేయాలని నగర పాలక ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రార్థన కోసం ఈద్గాకు వచ్చే ప్రతి ముస్లిం సోదరుడికి మాస్క్ అందజేయాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఈడి మహబూబ్ బాషా ను ఆదేశించారు. కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రార్థనలకు అనుమతి ఇస్తే సామాజిక దూరం పాటిస్తూ.. మాస్క్ ధరించి, ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని మత పెద్దలను కోరారు అనంతరం కమిషనర్ డీకే బాలాజి మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో కరోనా జాగ్రత్తలు పాటిస్తూ వైరస్ వ్యాప్తిని నియంత్రించదానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఖాజీ ముఫ్తి అబూస్ సలాం, నగర పాలక హెల్త్ ఆఫీసర్ భాస్కర్ రెడ్డి, ఎంఈ శేషాసాయి, డిఈ రాజశేఖర్, కార్పొరేటర్లు యూనుస్, జుబేర్, నాయకులు యూనుస్, ముస్లిం సోదరులు ఉన్నారు.