PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉన్నత విద్యకు పదవ తరగతి తొలి మెట్టు : జిల్లా కలెక్టర్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : ఉన్నత విద్యకు పదవ తరగతి అనేది తొలి మెట్టు లాంటిదని దానిని అధిగమించేందుకు అందరూ విద్యార్థులు కృషి చేయాలని విద్యార్థులకు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు మార్గనిర్దేశం చేశారు.కర్నూలు నగరంలోని ప్రభుత్వ టౌన్ మోడల్ హై స్కూల్ నందు విద్యార్థులకు ఏర్పాటు చేసిన మోటివేషన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు గారికి ముందుగా స్కౌట్స్ గౌరవ వందనంతో విద్యార్థులు జిల్లా కలెక్టర్ గారిని ఆహ్వానించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు తమ ఉపాధ్యాయులను మనం ముందుగా గౌరవించుకోవాలన్నారు. ఉపాధ్యాయులు నిత్యం విద్యార్థుల ఉన్నతి కోసం కృషి చేస్తూ వారికి మంచి మార్కులు తెప్పించే దిశగా కృషి చేస్తున్నారన్నారు. విద్యార్థులు ఒక్కరూ కూడా ఫెయిల్ కాకుండా చదువుకోవాలన్నారు. చాలా మంది తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వారిని చదివిస్తున్నారని మీ తల్లిదండ్రుల కష్టాన్ని విద్యార్థులు గుర్తుపెట్టుకొని ఉన్నత లక్ష్యాలు సాధించే దిశగా కృషి చేయాలన్నారు. ఏప్రిల్ 3వ తేది నుండి పరీక్షలు ఉన్నందున ప్రతి రోజు రెండు మార్కులు చొప్పున చివరి గ్రేడ్ లో ఉన్న విద్యార్థులు పై గ్రేడ్ లకు వెళ్లేలా ప్రయత్నించాలన్నారు. పదవ తరగతి పాస్ అయిన తరువాత ఎన్నో మార్గాల ద్వారా ఉన్నత చదువులకు అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులకు అవసరమైనవన్ని ప్రభుత్వం అందించడంతో పాటు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. పదవ తరగతి అనేది ఉన్నత విద్యకు తొలి మెట్టు లాంటిదని విద్యార్థులు గుర్తు పెట్టుకోవాలన్నారు. ఉపాధ్యాయులు బడిలోని పిల్లలను తమ పిల్లలుగా భావించి వారు ఉన్నత చదువులు చదివేలా వారిని ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. పదవ తరగతి విద్యార్థులు ఈ ఒక్క నెలకు ప్రణాళిక రూపొందించుకొని చదవాలన్నారు. అదే విధంగా సి మరియు డి గ్రేడ్ లలో ఉన్న విద్యార్థులకు అవసరమైన మెటీరియల్ ను అందించడంతో పాటు గ్రూపుల వారీగా విద్యార్థులను విభజించుకొని వారు తప్పకుండా ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.అనంతరం పాఠశాలలోని ఉపాధ్యాయులతో జిల్లా కలెక్టర్ సమావేశమై విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా వారితో చర్చించారు.కార్యక్రమంలో డిప్యూటీ డిఈఓ హనుమంతరావు, హెడ్ మాస్టర్ రాజకుమారి, ఇంఛార్జి హెడ్ మాస్టర్ ఇనాయతుల్ల, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

About Author