పరిపాలన చేతకాని సీఎం జగన్మోహన్ రెడ్డి..
1 min readతన మొండి వైఖరితో సమగ్ర శిక్షా ఉద్యోగులను ఆవేదనకు గురి చేస్తున్నారు
ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి బడేటి చంటి మండిపడ్డారు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఏలూరు కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న అంగన్వాడీలు 22 రోజులుగా, అదే విధంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు 13 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నారని అయినా సీఎం జగన్మోహన్ రెడ్డి చీమకుట్టినట్టు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ గత రోజులుగా సమగ్ర శిక్షా ఉద్యోగులు, అంగన్వాడి ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ సైకో ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని ధ్వజమెత్తారు. సమస్యలను పరిష్కరిస్తామని చర్చలకు ఆహ్వానించి యూనియన్ నేతలను చులకన భావంతో చూస్తూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం ప్రభుత్వానికి మంచిది కాదని హితవు పలికారు. ఎమ్మెల్యేల సీట్ల మార్పిడి పై ఉన్న శ్రద్ధ ఆందోళన చేస్తున్న ఉద్యోగులపై లేకపోవడం వైసిపి ప్రభుత్వానికి ప్రజా సంక్షేమంపై ఉన్న శ్రద్ధ ఏమిటో తేటతెల్లం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. సలహాదారులను పెట్టుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి చదువుకోకపోవడం వల్ల వారి సలహాలను పాటించలేని పరిస్థితుల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. పప్పు బెల్లాలను పంచడం తప్ప కష్టపడి పని చేస్తున్న వారికి న్యాయం చేయాలన్న ధ్యాస సైకో సీఎంకు లేదని ఆయన మండిపడ్డారు. సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలను, అంగన్వాడీల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్తానని, వారికి న్యాయం జరిగేంత వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని బడేటి చంటి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మాజీ వైస్ చైర్మన్ చోడే వెంకటరత్నం, ఏఎంసీ మాజీ చైర్మన్ పూజారి నిరంజన్, టిడిపి మాజీ విప్ గూడవల్లి శ్రీనివాస్, వందనాల శ్రీనివాస్, అమరావతి అశోక్, జాగాని సంతోషి మరియు వివిధ హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.