ఆదోనిలో వలసల నివారణపై సీఎం ప్రత్యేక దృష్టి
1 min read– రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు : ఆదోని ప్రాంతంలో వలసల నివారణపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. ఆదోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఆదోని శాసన సభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి,ఎమ్మిగనూరు శాసన సభ్యులు చెన్నకేశవ రెడ్డి, మంత్రాలయం శాసన సభ్యులు బాలనాగి రెడ్డి, పత్తికొండ శాసన సభ్యులు కంగాటి శ్రీదేవి తో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ ఆదేశాల వెనుకబడిన ఆదోని ప్రాంత నియోజకవర్గాలైన పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజక వర్గాల అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గాల్లోని ప్రజలు వలసలకు వెళ్తున్నారని, వాటిని నివారించాలన్న సదుద్దేశంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఐదు నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం అయ్యారని, ప్రజా ప్రతినిధుల సలహాల సూచలను తీసుకున్నారన్నారు. వలసలను నివారించి, వారికి ఇక్కడే ఉపాధి కల్పించేలా ఐదుగురు ఎమ్మెల్యేలు పలు సూచనలు ఇచ్చామన్నారు.. ఈ సూచనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి కార్యాచరణను రూపొందిస్తారని మంత్రి వివరించారు. అనంతరం ఆదోని శాసన సభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఒక గొప్ప సంకల్పంతో వెనుకబడిన ప్రాంత అభివృద్ధి కోసం ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఆదోని ప్రాంత అభివృద్ధి కోసం తీసుకోవలసిన చర్యలను జిల్లా కలెక్టర్ కు వివరించామని తెలిపారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు మంత్రి, ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు.. వలసల నివారణకు ఆయా నియోజక వర్గాల్లో తీసుకోవలసిన చర్యలను మంత్రి, ఎమ్మెల్యేలను అడిగి నోట్ చేసుకున్నారు. కలెక్టర్ తో పాటు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ రామ సుందర్ రెడ్డి, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పత్తికొండ ఆర్డిఓ మోహన్ దాస్, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్ రెడ్డి, రమణకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.