సమష్టి విజయం..
1 min read– ఓట్ల లెక్కింపు.. ప్రశాంతం..
– అందరికీ కృతజ్ఞతలు
– కలెక్టర్ జి. వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప
పల్లెవెలుగు, కర్నూలు బ్యూరో
కర్నూలు జిల్లాలో అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసిందని కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ డా.కె. ఫక్కీరప్పలు అన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా ముగించి సహకరించిన
అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి, నోడల్ అధికారులకు, పోటీలో ఉన్న అభ్యర్థులకు, ఓటర్లకు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఏజెంట్లకు మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం రాయలసీమ యూనివర్సిటీ లోని వార్ రూమ్ లో ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసిన సందర్భంగా పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ మాట్లాడుతూ ఎస్.ఈ.సి.నిబంధనల మేరకు జిల్లాలో తొమ్మిది మున్సిపాలిటీలకు సంబంధించి 11 కేంద్రాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఉదయం 8 గంటల నుండి ప్రారంభించి పూర్తి చేశామన్నారు. గెలుపొందిన అభ్యర్థులకు సంబంధిత రిటర్నింగ్ అధికారుల ద్వారా ధ్రువ పత్రాలు కూడా జారీ చేశామన్నారు. జిల్లావ్యాప్తంగా 225 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు పూర్తయిందన్నారు. ఓట్ల లెక్కింపును ఎస్.ఈ.సి నిబంధనల మేరకు సంపూర్ణ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, పగడ్బందీగా నిర్వహించామన్నారు.
పకడ్బందీగా.. ప్రణాళికగా..
అనంతరం ఎస్పీ డాక్టర్ కె. ఫకీరప్ప మాట్లాడుతూ జిల్లాలో 9 మున్సిపాలిటీలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందన్నారు. ఇందుకు సహకరించిన అధికారులందరికీ ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఓట్ల లెక్కింపు అనంతరం గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ సభలు, ఊరేగింపులు, సభలు, డప్పులు, బాణసంచా కాల్చడం నిషేధించామని ఇందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు అందరూ పోలీస్ యంత్రాంగానికి సహకరించాలని కోరారు. పోలీస్ యాక్ట్ 30, సెక్షన్ 144 అమల్లో ఉంటుందన్నారు.
సన్మానోత్సవం..
అనంతరం జిల్లాలో మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిష్పక్షపాతంగా, నిర్భయంగా, పారదర్శకంగా, విజయవంతంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ జి.వీరపాండియన్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, జేసీలు రామసుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజా, డి.ఆర్.ఓ పుల్లయ్యలను జిల్లా అధికారుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ శ్రీనివాసులు, జిల్లా అధికారులు ఘనంగా శాలువాతో సన్మానించారు.