స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలపై కలెక్టర్ సమీక్ష
1 min read– జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించేందుకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చర్యలు గైకొనాలని జిల్లా కలెక్టర్ జి సృజన అధికారులను ఆదేశించారు.సోమవారం జిల్లా పరిషత్ మీటింగ్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక “జగనన్నకుచెబుదాం-స్పందన” కార్యక్రమం అనంతరం 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణ ముందస్తు ఏర్పాట్లపై కలెక్టర్ డాక్టర్ జి.సృజన, అధికారులతో సమీక్షించారు.జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన 77వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల నిర్వహణకు చేయవలసిన ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడుతూ ఈ నెల 15న స్థానిక పోలీసు పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే వేడుకల్లో.. జెండా వందన కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను, వేదికను అందంగా అలంకరించాలని అధికారులను ఆదేశించారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. వివిధ రకాల శకటాలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా అందంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలిసేలా ఛాయ చిత్ర ప్రదర్శను కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులు ఆదేశించారు. స్వాతంత్రదినోత్సవ వేడుకల్లో ప్రభుత్వానికి ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి ఇచ్చే ప్రశంస పత్రాలను ఆయా శాఖల అధికారులు ఉత్తమ సేవలందించిన సిబ్బందిని మాత్రమే సిఫారసు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రశంసా పత్రాలకు సంబంధించి సిబ్బంది యొక్క పేర్లను ఈనెల 12వ తేదిలోపు, ఛాయ చిత్ర ప్రదర్శన, శకటాలు వివరాలను ఈ రోజు సాయంత్రంలోపు జిల్లా రెవిన్యూ అధికారికి అందజేయాలన్నారు.