PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విజయవాడలో ‘వాణిజ్య ఉత్సవ్​–2021’ ప్రారంభం

1 min read

పల్లెవెలుగువెబ్​, విజయవాడ: విజయవాడ ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ సెంటర్లో రెండు రోజులపాటు ఏర్పాటు చేసిన ‘వాణిజ్య ఉత్సవం-2021’ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్​.జగన్​ మంగళవారం ప్రారంభించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆజాదీ కీ అమృత్‌ మహాత్సవ్‌లో భాగంగా విజయవాడలో వాణిజ్య ఉత్సవ్‌‌-2021ను నిర్వహిస్తున్నారు. ఈ వాణిజ్య ఉత్సవ కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి వచ్చిన వివిధ దేశాలకు చెందిన దౌత్యాధికారులకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, ఎగుమతి దారులకు, ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిళ్ల సభ్యులకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులకు, మంత్రివర్గ సహచరులకు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, ఇతర భాగస్వాములందరికీ సీఎం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… విజయవాడలో ఈ వాణిజ్య ఉత్సవం రెండు రోజులపాటు కొనసాగుతుందని, తదుపరి నాలుగు రోజులపాటు వివిధ జిల్లాల్లో జరుగనున్నట్లు తెలిపారు. వారంరోజులపాటు వాణిజ్య సంబంధిత వర్గాలన్నీ కూడా ప్రభుత్వానికి దగ్గరగా ఉంటాయని, అలాగే ప్రభుత్వం కూడా వారికి దగ్గరగా ఉంటుందన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ‘ఆజాదీ కీ అమృత్‌ మహాత్సవ్‌’లో భాగంగా వాణిజ్య ఉత్సవ్‌ను నిర్వహిస్తున్నామని సీఎం వెల్లడించారు. ”గడచిన రెండేళ్లలో పెనుసవాళ్లను ఎదుర్కొన్నాం. ఆర్థిక మాంద్యం కారణంగా ఏడాదిలో ఆర్థిక సమస్య ఎదురయితే మరో ఏడాదిలో కోవిడ్‌ విపత్తును చూశామని, దీనివల్ల దేశవ్యాప్తంగా రెవిన్యూ వసూళ్లు 3.38శాతం పడిపోయాయి. 2018–19 మధ్యకాలంలో దేశం మొత్తం రెవిన్యూ వసూళ్లు రూ. 20,80,465 కోట్లు ఉంటే 2019–2020లో అవి రూ.20,10,059 కోట్లకు పడిపోయాయి” జగన్​ వివరించారు. ముందుగా వాణిజ్య ఉత్సవ్​ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ వాణిజ్య రంగ స్టాళ్లను సీఎం జగన్​ పరిశీలించారు.

About Author