నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి
1 min readపల్లెవెలుగు, వెబ్ పత్తికొండ : అధిక వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని కోరుతూ, గురువారం స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. ప్రతి ఏడాది రైతులు ఏదో విధంగా నష్టపోతూనే ఉన్నారని ఈసారి కూడా అధిక వర్షాలకు పంటలన్నీ దెబ్బతిని రైతులు కోలుకోని విధంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వేరుశనగ పత్తి టమోటా ఉల్లి రైతులు అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ఈ నేపథ్యంలో రైతన్నలు ఆత్మహత్యలే శరణ్యంగా భావిస్తున్నారని ఆందోళన చెందారు. ఎకరాకు 30 వేల వరకు పెట్టుబడులు పెట్టి పంటలు పండించగా అనుకోని విధంగా వర్షాలు కురవడంతో చేతికొచ్చిన పంట నీటి పాలైందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను అన్ని విధాల ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. నష్టపోయిన దెబ్బతిన్న పంటలను పూర్తిస్థాయిలో అంచనాలు వేసి నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధాన పంటలు వేరుశనగ టమోటా పత్తి ఉల్లి పంటలకు ఎకరాకు 30 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని కోరారు. దాదాపు అరగంట పాటు తాసిల్దార్ కార్యాలయం ఎదుట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని నినాదాలు చేశారు. అనంతరం ఇన్చార్జి తాసిల్దార్ విష్ణు ప్రసాద్ కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం మండల కార్యదర్శి సిద్దయ్య గౌడు సిపిఎం మండల కార్యదర్శి దస్తగిరి గోపాలు ఈరన్న ఆవాజ్ కమిటీ నాయకులు రాజా, డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.