పెండింగ్లో ఉన్న ఓటర్ల జాబితా పరిశీలనను పూర్తి చేయండి
1 min read– రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమీక్షించిన డిఆర్ఓ పుల్లయ్య
పల్లెవెలుగు వెబ్ నంద్యాల : తప్పులు లేని పారదర్శక ఓటర్ల జాబితా రూపకల్పన నిమిత్తం బిఎల్ఓ లకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి బి. పుల్లయ్య కోరారు. బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ఓటర్ల జాబితా సవరణపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పుల్లయ్య, అన్ని నియోజకవర్గాల ఈఆర్వో, ఏఈఆర్వోలు, బిజెపి తరఫున ఎం. గంగాధర్, సిపిఐ పార్టీ తరఫున ఎన్ రంగనాయుడు, సిపిఐఎం ప్రతినిధి రమేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ తరఫున సయ్యద్ రియాజ్ భాష, తెలుగుదేశం పార్టీ తరఫున నరేంద్ర కుమార్, వైయస్సార్ సిపి పార్టీ తరఫున అనిల్ అమృతరాజ్, సాయిరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డిఆర్ఓ పుల్లయ్య మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ద్వారా తప్పులు లేని పారదర్శక ఓటర్ల జాబితా తయారు చేసేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం గత నెల 21 వ తేదీ నుండి బిఎల్ఓలు ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలను పరిశీలిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు భూస్థాయి ఏజెంట్లను నియమించడంతోపాటు పారదర్శక ఓటర్ల జాబితాకు సహకరించాలన్నారు. పెండింగ్లో ఉన్న ఇంటింటి సర్వే ను నిర్ణీత కాలంలో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లను ఆయన ఆదేశించారు.బూత్ స్థాయి అధికారులు వాలంటీర్లతో కూడి ఇంటింటి సర్వే చేపడుతున్నారని రాజకీయ పార్టీల నాయకులు డిఆర్ఓ దృష్టికి తీసుకురాగా అలాంటి చర్యలు పాల్పడకుండా తగు చర్యలు తీసుకోవాలని ఈఆర్వో, ఏఈఆర్ఓ లను డిఆర్ఓ ఆదేశించారు. హోటల్ జాబితాలో చనిపోయిన ఓట్లను తొలగించడంతోపాటు గిరిజన ప్రాంతాలలో ఉన్న ఓట్లను పరిశీలించి ఓటర్ల జాబితాలో నమోదు చేయాలని వారు కోరారు. ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పులు, తొలగింపులు, స్త్రీ పురుష నిష్పత్తి, బోగస్ ఓట్లు ఒకే ఇంట్లో 10 ఓటర్లకు మించిన కుటుంబాలు తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిశీలిస్తారన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో బిఎల్ఓ ను యూనిట్ గా తీసుకుని పారదర్శకంగా పరిశీలించి ఓటర్ల జాబితాలో నమోదు చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి బూత్ స్థాయి ఏజెంట్లు కూడా పారదర్శక ఓటర్ల జాబితా రూపకల్పనకు సహకరించాలని డిఆరోఓ తెలిపారు.