పుట్టిన 30 గంటలలోపే శిశువుకు సంక్లిష్టమైన గుండె శస్త్రచికిత్స
1 min read– విశాఖపట్నం కిమ్స్ కడల్స్ ఆస్పత్రి వైద్యుల ఘనత
పల్లెవెలుగు వెబ్ విశాఖపట్నం : విశాఖపట్నం నగర చరిత్రలోనే తొలిసారిగా కేవలం పుట్టిన 30 గంటలలోపే శిశువుకు సంక్లిష్టమైన గుండె శస్త్రచికిత్స జరిగింది. ప్రముఖ చిన్నపిల్లల గుండె శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ అనిల్ కుమార్ ధర్మపురం నేతృత్వంలోని బృందం కిమ్స్ కడల్స్ ఆస్పత్రిలో ఈ ఘనత సాధించింది. ఇందుకు సంబంధించిన వివరాలను కార్డియోథొరాసిక్ సర్జన్, చిన్నపిల్లల గుండె శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. ‘‘ఒక యువజంటకు పుట్టిన శిశువుకు పుట్టుకతోనే అబ్‌స్ట్రక్టెడ్ టోటల్ ఎనామలస్ పల్మనరీ వీనస్ కనెక్షన్ (టీఏపీవీసీ) అనే సమస్య ఉంది. దాంతో శిశువుకు ఊపిరి అందక ఇబ్బంది పడుతుండటంతో అత్యవసరంగా కడల్స్ ఎన్ఐసీయూ (నియోనాటల్ ఐసీయూ)లో చేర్చారు. డాక్టర్ నిఖిల్ తెన్నేటి నేతృత్వంలోని శిశువైద్య నిపుణుల బృందం వెంటనే ఆ శిశువుకు గుండె సమస్య ఉందని అనుమానించారు. చిన్నపిల్లల గుండెవైద్య నిపుణురాలు డాక్టర్ శాంతిప్రియ వెంటనే ఆ శిశువును పరీక్షించగా, టీఏపీవీసీ అనే సంక్లిష్టమైన గుండె సమస్య ఉందని గుర్తించారు. దీని కారణంగా ఊపిరితిత్తుల నుంచి గుండెకు శుద్ధి చేసిన రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు గుండెకు ఎడమవైపు కాకుండా కుడివైపు డ్రెయిన్ అవుతున్నాయి. ఇలా కుడివైపు కలిసే రక్తనాళాల దగ్గర ఒక పెద్ద బ్లాక్ ఉంది. దానివల్ల ఊపిరితిత్తుల నుంచి గుండెకు రక్తసరఫరాకు ఆటంకం కలిగింది. దీనివల్ల ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరిగి పల్మనరీ హైపర్‌టెన్షన్ ఏర్పడింది. ఈ కారణంగా శిశువుకు ఊపిరి అందకపోవడంతో శస్త్రచికిత్సకు ముందు వెంటిలేటర్ మీద పెట్టాల్సి వచ్చింది. శిశువుకు ఉన్న గుండె సమస్య చాలా అత్యవసరంగా చికిత్స చేయాల్సినది కావడంతో, వెంటనే మేజర్ సర్జరీకి తీసుకెళ్లాల్సి వచ్చింది. సమస్య ఇదీ అని గుర్తించగానే వెంటనే టీఏపీవీసీని ఇంట్రా కార్డియాక్ రిపేర్ కోసం శస్త్రచికిత్స చేశాం. దాదాపు 8 గంటలకు పైగా చేయాల్సి వచ్చిన ఈ శస్త్రచికిత్సలో, గుండె కుడివైపు వెళ్లిన రక్తనాళాలను తిరిగి ఎడమవైపు మార్చి సాధారణ స్థితికి తీసుకొచ్చాం. కేవలం 30 గంటల వయసు మాత్రమే ఉండటంతో శిశువు గుండె కణజాలాలు చాలా సున్నితంగా ఉంటాయి. అందువల్ల శస్త్రచికిత్స చేయడం సాంకేతికంగా చాలా సంక్లిష్టంగా ఉంటుంది, సవాలుతో కూడుకున్నది. మత్తు ఇవ్వడం, ఇంటెన్సివ్ కేర్‌లో సంరక్షణ కూడా అంతే సమస్యాత్మకం. అన్నీ సజావుగా సాగడంతో శిశువును నియోనాటల్ యూనిట్‌లో రెండు రోజుల పాటు ఉంచిన తర్వాత గణనీయంగా కోలుకుంది. పాలు కూడా బాగానే తాగుతుండటంతో అన్నీ చూసుకుని డిశ్చార్జి చేశారు. నెల రోజుల తర్వాత మళ్లీ ఫాలో అప్ కోసం తీసుకొచ్చినప్పుడు చూస్తే, శిశువు బరువు పెరగడంతో పాటు చిరునవ్వులు చిందిస్తోంది’’ అని ఆయన వివరించారు.తమ శిశువు ప్రాణాలు కాపాడిన కిమ్స్ కడల్స్ ఆస్పత్రి వైద్య బృందానికి, నర్సులు, ఇతర సిబ్బందికి, యాజమాన్యానికి శిశువు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.