న్యాయ పరిష్కారానికి రాజీమార్గమే రాజమార్గం
1 min read– జూనియర్ సివిల్ జడ్జి దివ్య
పల్లెవెలుగు, వెబ్ పత్తికొండ : సత్వరమే న్యాయ పరిష్కారానికి రాజీ మార్గమే రాజ మార్గమని పత్తికొండ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి దివ్య కక్షిదారులకు సూచించారు. జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా మంగళవారం పత్తికొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో న్యాయ సేవా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి దివ్య మాట్లాడుతూ, దీర్ఘకాలికంగా పరిష్కారం కాకుండా కక్షిదారులు అన్ని విధాలుగా నష్టపోవడం కంటే న్యాయ పరిష్కారం కోసం రాజీమార్గాన్ని ఎంచుకోవడం ఉత్తమమని అన్నారు. సత్వర న్యాయ పరిష్కారం కోసం లోక్ అదాలత్ వేదికను ఆశ్రయించాలన్నారు. ఇరువర్గాల కక్షిదారులు సహృద్భావంతో రాజీద్వారా న్యాయ పరిష్కారం దిశగా సాగాలన్నారు. న్యాయ పరిష్కారం కోసం వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఏళ్ల తరబడి కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరుగుతూ మానసిక క్షోభకు గురికాకూడదని ఆమె ఆకాంక్షించారు. న్యాయ సేవ సదస్సు నిర్వహణ అనంతరం. న్యాయవాదులు పట్టణంలో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ఈరన్న, మై రాముడు, ఉల్తన్న, కృష్ణయ్య, సురేంద్ర కుమార్, రంగస్వామి, నారాయణస్వామి, అశోక్ కుమార్, లక్ష్మయ్య, మహేష్ శ్రీనివాస్ రెడ్డి, ప్రసాద్, నాగేష్ వెంకటేశ్వర్లు, కారం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.