ముస్లింలపై హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యలకు ఖండన
1 min read– నేషనల్ వైస్ చైర్మన్ జమీల్ అహ్మద్ బేగ్
పల్లెవెలుగు వెబ్ విజయవాడ: తెలంగాణా పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ముస్లిం మైనార్టీ వర్గాలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం నేషనల్ వైస్ చైర్మన్, తెలంగాణ, ఆంధ్ర ఎన్‌సిపి మైనార్టీ విభాగం ఇన్‌చార్జి జమీల్ అహ్మద్ బేగ్ తీవ్రంగా ఖండించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీ వర్గాలపట్ల వ్యవహరిస్తున్న తీరును, కర్నాటకలో అధికారంలో ఉండి ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసిన తీరును, కేంద్రంలో మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ స్కీమ్ రద్దు చేయడం, ముస్లింలను విద్య, ఆదాయాలకు దూరం చేసి ముస్లింలను అణచివేసే ధోరణులను దేశ వ్యాప్తంగా ముస్లిం మైనార్టీ వర్గాలతోపాటు ఇతర వర్గాలూ గమనిస్తున్నాయని, తగిన సమయంలో బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణాలో బీజేపీకి చేదు అనుభవం ఖాయమన్నారు. హిందూ ముస్లిం భాయి భాయిగా ఉండే దేశ ప్రజల మధ్య విభజించు పాలించు సూత్రంలో ముస్లింలను దూరం చేయడం సరికాదన్నారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఎంతోమంది ముస్లింలు పోరాడారని, నేడు కూడా దేశంకోసం ప్రాణాలర్పించడానికి ముస్లింలు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణాలో అధికారంలోకి వస్తే ముస్లిం మైనార్టీల రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్‌షా వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, దేశ వ్యాప్తంగా ముస్లింలు అందరూ ఏకతాటిపై నడిచి బీజేపీకి, బీజేపీకి మద్దతు పలుకుతున్న పార్టీలకు వ్యతిరేకంగా ఓటుచేసి తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం నేషనల్ వైస్ చైర్మన్ జమీల్ అహ్మద్ బేగ్ అన్నారు.