ప్రభుత్వాలపై… కాంగ్రెస్ ఫైర్..
1 min read– పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ..
– డీసీసీ అధ్యక్షులు అహమ్మద్ ఆలీఖాన్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతూ.. సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నాయని ధ్వజమెత్తారు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అహమ్మద్ ఆలీఖాన్. ఏ దేశంలో.. ఏ రాష్ట్రంలో లేని విధంగా ట్యాక్స్ ల రూపంలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, జాతీయ స్థాయిలో ధరలు పెరిగినప్పుడు పెంచుతారని అదే ధరలు తగ్గినప్పుడు మాత్రం తగ్గడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా కర్నూలులో కాంగ్రెస్ నాయకులు ఎద్దుల బండిపై నిరసన తెలిపారు. పార్టీ కార్యాలయం నుంచి కొండారెడ్డి బురుజు వరకు ఎద్దుల బండిపై శాంతియుతంగా నిరసన తెలిపారు.
కోవిడ్ నియంత్రణకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సలహాలు, సూచనలు ఇచ్చినా… మోదీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని విమర్శించారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అహమ్మద్ ఆలీఖాన్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు జి నాగమధు యాదవ్ కర్నూలు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు జాన్ విల్సన్ మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు మంత్రాలయం కాంగ్రెస్ ఇంఛార్జ్ ఎస్ బాబూరావు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పాలం సుజాత ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ జిల్లా ఐఎన్టీయూసీ నాయకులు బి. బతకన్న, జిల్లా సేవాదళ్ చైర్మన్ సజ్జాద్ హుస్సేన్ పాల్గొన్నారు.