న్యూ ఎస్.సి.కాలనీ లో సి.సి రోడ్ల నిర్మాణం చేపట్టాలి
1 min read
సి.సి.రోడ్లు లేక గుంతలమయంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీ వాసుల సమస్యను తక్షణమే పరిష్కరించాలి
సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఎం.సత్యన్న
ఎమ్మిగనూరు, న్యూస్ నేడు: ఎమ్మిగనూరు పట్టణంలోని న్యూ ఎస్సీ కాలనీ నందు సిసి రోడ్లు లేక, వర్షపు నీటితో గుంతల మయంగా మారిన దుస్థితి కాలనీవాసులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే ప్రభుత్వ అధికారులు సమస్యను పరిష్కరించాలని సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఎం.సత్యన్న డిమాండ్ చేశారు. సోమవారం నాడు స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని న్యూ ఎస్సీ కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించారు.ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఎం.సత్యన్న మాట్లాడుతూ ఎమ్మిగనూరు పట్టణంలోని న్యూ ఎస్సీ కాలనీ నందు మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రధానంగా సిసి రోడ్ల నిర్మాణం చేపట్టకపోవడంతో చిన్నపాటి వర్షాలకు ఇళ్లలోకి నీరు చేరి విష జ్వరాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తేలికపాటి వర్షం పడిన ఇక్కడి రహదారి మొత్తం గుంతలమయంతో ,బురద ఎక్కువగా ఉండడంతో వృద్ధులు, చిన్నారులు నడవలేని దుస్థితి ఏర్పడిందని అన్నారు. అంతేకాకుండా పక్కనే ఉన్న వంకలో కోళ్ల వ్యర్ధాలు ,మురుగునీరు పూర్తిగా కాలనీ లోకి ప్రవేశించి దుర్వాసన విపరీతంగా ఉన్నదని తెలిపారు. తక్షణమే వంకకు ప్రహరీ గోడ నిర్మించి వంక మురుగునీరు కాలనీలోకి ప్రవేశించకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. న్యూ ఎస్సీ కాలనీ తో పాటు ఎస్ఎంటి కాలనీ మునెప్ప నగర్ నందు కూడా ఈ వంక వలన సమస్య ఏర్పడిందని తెలిపారు. తక్షణమే స్థానిక ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి , ఎమ్మిగనూరు మున్సిపాలిటీ కమిషనర్ ఈ కాలనీలను పరిశీలించి ప్రజలకు అవసరమైన మౌలిక వసతులతో పాటు, సీసీ రోడ్ల నిర్మాణం, వంకకు ప్రహరీ గోడ తక్షణమే యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో స్థానికులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఐ.ఎఫ్.టి.యు నాయకులు బాలరాజు,బాబు,కాలనీ వాసులు బాలస్వామి, నగేష్,రాజు,శాంతి,లక్ష్మీ,సులోచన తదితరులు పాల్గొన్నారు.