గణేష్ నిమజ్జనం నిర్వహణ ఏర్పాట్ల పై సమన్వయ సమావేశం
1 min read– వినాయక నిమజ్జనం ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేలా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాం
– జిల్లా ఇంఛార్జి కలెక్టర్ నారపురెడ్డి మౌర్య
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : సెప్టెంబర్ 26వ తేదీన నిర్వహించనున్న వినాయక నిమజ్జనం ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేలా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా ఇంఛార్జి కలెక్టర్ నారపురెడ్డి మౌర్య ఉత్సవ కమిటీ సభ్యులకు తెలిపారు.మంగళవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో గణేష్ నిమజ్జనం నిర్వహణ ఏర్పాట్ల పై వివిధ శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో జిల్లా ఇంఛార్జి కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్, మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజ, జిల్లా రెవెన్యూ అధికారి నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఇంఛార్జి కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 26వ తేదీన నిర్వహించనున్న వినాయక నిమజ్జనం ఉత్సవ నిర్వహణ కు సంబంధించి ఆయా శాఖలకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు… కె.సి.కెనాల్ లో విగ్రహాల నిమజ్జనానికి తగినంత నీటి నిల్వలు ఉన్నాయా అని ఇరిగేషన్ ఎస్ ఈ తో ఇంఛార్జి కలెక్టర్ చర్చించారు..ప్రస్తుతం అయితే నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని, ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున, రాబోవు రోజుల్లో పరిస్థితిని బట్టి అంచనా వేయవచ్చని ఎస్ ఈ కలెక్టర్ కు వివరించారు.. ఈ అంశం పై తదుపరి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో విగ్రహాలు పెద్ద పెద్దవి కాకుండా అన్ని చోట్ల చిన్న చిన్న మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, ఫిషరీస్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేసి సజావుగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లను చేయాలని ఇంఛార్జి కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిమజ్జనం మార్గంలో కరెంట్ తీగలు, కేబుల్ వైర్ లు అడ్డు రాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఘాట్ల వద్ద లైఫ్ జాకెట్ లు, బోట్లు, గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండే విధంగా మత్స్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. రోడ్ల మరమ్మతులకు సంబంధించి రోడ్లు మరియు భవనాల శాఖ, మునిసిపల్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బార్కేడింగ్ కు సంబంధించిన పనులు బాగా చేయాలని రోడ్లు మరియు భవనాల శాఖ ఎస్ ఈ ని ఆదేశించారు. ఘాట్ల వద్ద అంబులెన్స్, మెడికల్ కిట్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిఏంహెచ్ఓ ని అదేశించారు. ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాల్లో కూడా గణేష్ నిమజ్జనం నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ను ఆదేశించారు.జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ మాట్లాడుతూ కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంతంగా నిమజ్జనం జరిగేలా గట్టి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.పోలీస్ యంత్రాంగం, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు.నిమజ్జనం జరిగే రోజుకు 48 గంటలు ముందుగానే వైన్ షాపులు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని అబ్కారీ శాఖ అధికారులను ఆదేశించారు. ఘాట్ ల వద్ద 7 క్రేన్ లు ఏర్పాటు చేయాలని, వాటితో పాటు దానికి సంబంధించి రిపేర్ చేసే మనిషి కూడ అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఘాట్ వద్ద గజ ఈతగాళ్లు ఎక్కువ మంది ఉండేలా చూసుకోవాలన్నారు . సున్నితమైన ప్రదేశాలలో లా అండ్ ఆర్డర్ కి సంబంధించి ఒక పోలీస్ అధికారి, తహశీల్దార్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మునిసిపల్ కమీషనర్ భార్గవ్ తేజ మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం విజయవంతం గా నిర్వహించేలా ఉత్సవ సమితి సభ్యులకు పూర్తి స్థాయి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. అదే విధంగా ఉత్సవ సమితి సభ్యులు కూడా అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరారు.. కేన్ ల ఏర్పాటు,తాగు నీరు, శానిటేషన్ తదితర అంశాలకు సంబంధించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మార్గ మధ్యంలో కేబుల్ , విద్యుత్ తీగలు అంతరాయం కలిగించకుండా క్లియర్ చేయిస్తామని తెలిపారు.తదనంతరం గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా వినాయక ఘాట్ వద్ద కె సి కెనాల్ లో నిమజ్జనం చేయడం ఆచారంగా వస్తోందని, ఈసారి కూడా అలాగే జరిగే విధంగా చూడాలని కలెక్టర్ ను కోరారు.. ఆంక్షలు లేకుండా పండుగ జరుపుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఎస్పీ ని కోరారు. విద్యుత్తు సరఫరా కు సంబంధించి ఆ శాఖ అధికారులు సహకరించాలని కోరారు.. ఆదోని,ఎమ్మిగనూరు పట్టణాలలో కూడా విజయవంతంగా నిమజ్జోత్సవం జరిగేలా అధికారులు సహకరించాలని, హోళగుంద, గోనె గండ్ల మండల కేంద్రాల్లో నిమజ్జనోత్సవం జరుపుకునేందుకు అనుమతినివ్వాలని కలెక్టర్, ఎస్పీ లను కోరారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పాల్గొనగా, సమావేశంలో డిఆర్వో నాగేశ్వర రావు, ఇరిగేషన్ ఎస్ ఈ రెడ్డి శేఖర్ రెడ్డి, ఆర్డీవో హరి ప్రసాద్, డిఎంహెచ్వో డా.రామ గిడ్డయ్య,ఎండోమెంట్స్ ఏసి రామాంజనేయులు, జిల్లా ఫిషరీస్ అధికారి శ్యామల, డిఎస్పీ లు, తహసీల్దార్ లు, గణేష్ ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షుడు కృష్ణన్న, నగర అధ్యక్షుడు మోక్షేశ్వరుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్, డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రెటరీ రంగస్వామి, సిటీ జనరల్ సెక్రెటరీ వేణుగోపాల్, సిటీ వైస్ ప్రెసిడెంట్ హరీష్ బాబు, డిస్టిక్ ఆర్గనైజేషన్ సెక్రటరీ నాగఫణి శాస్త్రి, ఎమ్మిగనూరు ప్రధాన కార్యదర్శి నరసింహులు, ఆదోని డివిజన్ ఇంఛార్జి నీలకంఠ తదితరులు పాల్గొన్నారు.