నకిలీ కరెన్సీ నోట్ల మోసం..!
1 min read-ఇద్దరి అరెస్ట్
పల్లెవెలుగు వెబ్, ప్యాపిలి: లక్ష రూపాయలుకు ఒరిజినల్ నోట్లు ఇస్తే… మూడు లక్షలు ఇస్తామని చెప్పి.. ఓ అమాయకుడి దగ్గర రూ.19లక్షలు వసూలు చేసిన మోసగాళ్లను పోలీసులు గురువారం రాత్రి అరెస్టు చేశారు. నకిలీ నోట్ల విషయమై ఈ నెల 6వ తేదీన కోదండరాముడు భార్య సారం మంగమ్మ ప్యాపిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ కేసు విచారణలో ఉండగానే మోసగాళ్ల భాగోతం బయట పడింది. వివరాలిలా ఉన్నాయి. ప్యాపిలికి చెందిన కోదండరాముడు అనే వ్యక్తి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ప్యాపిలి మండలం వెంగళంపల్లికి చెందిన మెట్టుపల్లి విజయభాస్కర్, కడపకు చెందిన ఆవుల రాజశేఖర్ ఘరానా మోసానికి పాల్పడ్డారు. కోడండరాముడు నుంచి లక్ష రూపాయలు ఒరిజినల్ నోట్లు తీసుకుని.. రూ. మూడు లక్షలు నకిలీ నోట్లు ఇచ్చారు. ఈ విషయమై మార్చి 6వ తేదీన కోదండరాముడు భార్య సారం మంగళం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గురువారం రాత్రి పోలీసులు ప్యాపిలీలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు మోసగాళ్లు విజయభాస్కర్, రాజశేఖర్ వద్ద నుంచి రూ.3.50లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిలను రిమాండ్కు పంపారు. నకిలీ నోట్ల చెలామణిలో ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సీఐ రామలింగయ్య, ఎస్ఐ మారుతి శంకర్ తెలిపారు.