‘కౌంటింగ్’ .. పకడ్బందీగా చేయాలి
1 min readనిబంధనలు పాటించాల్సిందే..
– జేసీ సయ్యద్ ఖాజా మొహిద్దీన్
పల్లెవెలుగు, కర్నూలు
మున్సిపల్, నగరపాలక సంస్థ పరిధిలో జరిగిన ఎన్నికల కౌంటింగ్‌ను పకడ్బందీగా నిర్వహించాలని జేసీ (ఆసరా మరియు సంక్షేమం) సయ్యద్ ఖాజా మొహిదద్దీన్ అధికారులకు, సిబ్బందికి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నగర పాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ డీ.కే.బాలాజీ ఆధ్వర్యంలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ మున్సిపాలిటీలు మరియు గూడూరు నగర పంచాయతీ మున్సిపాలిటీ రిటర్నింగ్ ఆఫీసర్ లు, కౌంటింగ్ సూపర్ వైజర్స్ లకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పై ఒక రోజు శిక్షణ జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) సయ్యద్ ఖాజా మోహిద్దీన్ మాట్లాడుతూ బ్యాలెట్ ఓట్లు అభ్యర్థుల తరఫున ఏజెంట్లకు చూపించి లెక్కింపు చేయాలన్నారు. బ్యాలెట్ పేపర్ ల చెల్లుబాటుకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలన్నారు. ఓట్ల లెక్కింపులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలన్నారు. రౌండ్ పూర్తి అయిన వెంటనే కౌంటింగ్ ఏజెంట్ లకు వివరాలు తెలియజేసి వారి నుంచి సంతకాలు తీసుకోవాలన్నారు. ప్రతిదీ వీడియోగ్రఫీ చేయించాలన్నారు. కౌంటింగ్ హాల్లో ఫ్యాన్లు, నీటి సరఫరా, అన్ని చోట్ల విద్యుత్ సౌకర్యం ఉండాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని, ఎలాంటి ఆలస్యం లేకుండా కౌంటింగ్ చేపట్టాలన్నారు. అదే విధంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించామని, మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కూడా విజయవంతం చేయాలన్నారు. అనంతరం కర్నూలు నగర పాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ డీకే బాలాజీ మాట్లాడారు. మాస్టర్ ట్రైనర్ లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఓట్ల లెక్కింపు విధివిధానాలను వివరించారు. శిక్షణలో కర్నూలు నగర పాలక సంస్థ అడిషనల్ కమిషనర్ రామలింగేశ్వర్, డి ఆర్ ఓ పుల్లయ్య, ఆదోని ఆర్ డి ఓ రామకృష్ణరెడ్డి, నంద్యాల మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, ఆత్మకూరు మున్సిపాలిటీ కమిషనర్ డి.వెంకటదాసు, ఆదోని మున్సిపల్ కమిషనర్ కృష్ణ, ట్రైనింగ్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ సోమశేఖర్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ డ్వామా ఆడిషినల్ పిడి సలిమ్ బాషా, రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్ వైజర్స్ లు తదితరులు పాల్గొన్నారు.