జనతా కర్ఫ్యూ కు.. ఏడాది..
1 min readకోవిడ్ నియంత్రణ..అందరితో సాధ్యం..
– అర్హత ఉన్న వారు వ్యాక్సినేషన్ వేయించుకోండి
– జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ జి . వీరపాండియన్, ఎస్పీ డాక్టర్ కె. పకీరప్ప లు పేర్కొన్నారు. కోవిడ్ నియంత్రణ కోసం చేపట్టిన జనతా కర్ఫ్యూ కు ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద మున్సిపల్ కార్పొరేషన్, పోలీసు శాఖ, వైద్య ఆరోగ్య శాఖ ల సంయుక్త ఆధ్వర్యంలో కోవిడ్ నియంత్రణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జి . వీరపాండియన్ మాట్లాడుతూ ప్రపంచాన్ని వేధించిన కరోనా మహమ్మారి గత సంవత్సరం భారతదేశంలో అడుగుపెట్టిందని, ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ప్రకటించారని, ఏపీలో కూడా లాక్ డౌన్ ప్రకటించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించి నేటికీ సంవత్సరం పూర్తయిందన్నారు. సంవత్సర కాలం పూర్తయిన తరువాత మళ్లీ కేసులు పెరుగుతున్నాయన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రంలో ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయని మన రాష్ట్రంలో కూడా కొద్దిగా కేసులు పెరుగుతున్నాయన్నారు. జిల్లాలో గతవారం నుంచి 50 కేసులు పెరిగాయన్నారు. అర్హత ఉన్న వారు వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. నిబంధనలు పాటించకపోతే .. కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజలకు హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రామ గిడ్డయ్య, అడిషనల్ ఎస్పీ గౌతమి శాలిని, డి ఐ ఓ విశ్వేశ్వర్ రెడ్డి, డాక్టర్ రేఖ, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.