‘కోవిడ్’మరణాలు.. ప్రభుత్వ హత్యలే..
1 min read– మాజీ ఎమ్మెల్యే బీవీ నాగేశ్వర రెడ్డి
పల్లెవెలుగు వెబ్, ఎమ్మిగనూరు : వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం.. సీఎం అసమర్థ పాలన వల్లే రాష్ట్రంలో కోవిడ్ మరణాలు పెరుగుతున్నాయని ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే బీవీ నాగేశ్వర రెడ్డి ఆరోపించారు. ఆక్సిజన్ అందక మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని బుధవారం తన నివాసం వద్ద కొవ్వెత్తి వెలిగించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్ రెడ్డి మూర్ఖత్వంతో కరోనా బాధితులు రోజూ వందల సంఖ్య లో పిట్టల్లా రాలిపోతున్నారని, అయినప్పటికీ నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. కరోనా వల్ల కాక ఆక్సిజన్ అందక ఇప్పటివరకు రాష్ట్రంలో చాలా మంది చనిపోవడం దురదృష్టకరమని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అన్నారు. సరైన సమయంలో ప్రభుత్వం స్పందించి ముందస్తు చర్యలు తీసుకొని ఆక్సిజన్ అందించి ఉంటే ఇన్ని మరణాలు సంభవించేవి కాదని గుర్తు చేశారు.రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది చనిపోయారని చెప్పారని, కానీ 30కి పైగా ఉండొచ్చని వార్తలు వస్తున్నాయన్నారు. దీనిపై టీడీపీ నిజ నిర్దారణ కమిటీ వేసిందని, సీఎం జగన్ రెడ్డి అసమర్థ పాలనకు రుయా ఆస్పత్రి మరణాలే నిదర్శనమన్నారు.