గోసంరక్షణ.. వ్యక్తి ధర్మమే కాదు సమిష్టి ధర్మం
1 min read– డాక్టర్ మల్లు వేంకటరెడ్డి
పల్లెవెలుగు వెబ్: సమస్త జీవకోటికి తల్లి తర్వాత అంతటి బాధ్యత వహిస్తున్నది..ఆదరిస్తున్నది గోమాతే..నని అటువంటి గోవును, గోజాతిని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా,రాజకీయాలకతీతంగా సంరక్షించుకోవలసిన బాధ్యత సమాజంలోని అందరిపై ఉన్నదని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. పత్తికొండ మండలం అటికెలగుండు గ్రామం లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు మంగళవారం నుండి మూడు రోజుల పాటు బి.రాజాజయచంద్రన్ చే ధార్మిక ప్రవచనాలు, స్థానిక భజన మండలిచే భజన కార్యక్రమాలు, శుక్రవారం కుంకుమార్చన గోపూజ కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముగింపు సందర్భంగా గోమాతతో గోవింద నామ స్మరణలతో శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ సనాతన ధర్మం ప్రపంచానికే ఆదర్శ ప్రాయమని, సైన్సు ఎంత అభివృద్ధి చెందితే మన ధర్మం అంత విశ్వవ్యాప్తమవుతుందన్నారు. మన ప్రాచీన ఋషులు గొప్ప విజ్ఞానవేత్తలని, దార్శనికులని అన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం ధర్మకర్త మరియు పత్తికొండ పి.ఎ.సి.ఎస్.చైర్ పర్సన్ మెదేపాటి ప్రభాకర రెడ్డి, అర్చకులు కరణం మల్లిఖార్జున , కరణం పవన్ కుమార్ , ధర్మప్రచార మండలి సభ్యులు కోదండరాముడు,తుగ్గలి మండల ధర్మప్రచారక్ బోగిని కౌలుట్లయ్య, పత్తికొండ మండల ధర్మప్రచారక్ వై.కె.రంగన్న భజన మండలి సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.