సైక్లింగ్ సంఘం సభ్యులకు సీపీఆర్ శిక్షణ
1 min read– అత్యవసర సమయాల్లో ప్రాణరక్షణకు ఉపయుక్తం
– గచ్చిబౌలి స్టేడియం వద్ద నిర్వహించిన ఎస్ఎల్‌జీ వైద్యులు
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్: అత్యవసర సమయాల్లో పక్కన ఉన్నవారి ప్రాణాలను రక్షించడానికి బేసిక్ లైఫ్ సపోర్ట్ (బీఎల్ఎస్) శిక్షణ చాలా ముఖ్యం. ప్రధానంగా, సీపీఆర్ (కార్డియో పల్మనరీ రీససిటేషన్) చేయడం ఎలాగో తెలిస్తే ఎవరికైనా గుండెపోటు వచ్చినప్పుడు వాళ్ల ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. ఇటీవలి కాలంలో బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుతో మరణించిన వ్యక్తులను చూశాం. ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో.. ఎస్ఎల్‌జీ ఆస్పత్రి ఆధ్వర్యంలో సైక్లింగ్ సంఘం సభ్యులకు సీపీఆర్‌లో శిక్షణ ఇచ్చారు. సుమారు వంద మంది వరకు సభ్యులకు గచ్చిబౌలి స్టేడియం వెలుపల ప్రాంతంలో ఈ శిక్షణ అందించారు. ఎస్ఎల్‌జీ ఆస్పత్రికి చెందిన ఎమర్జెన్సీ విభాగాధిపతి డాక్టర్ టి. అప్పిరెడ్డి నేతృత్వంలో అదే విభాగానికి చెందిన డాక్టర్ హేమసింధు, డాక్టర్ విఠల్ స్వయంగా వెళ్లి, అక్కడ ఉన్న సైక్లింగ్ సంఘం సభ్యులందరితో బొమ్మలపై సీపీఆర్ ప్రాక్టీసు చేయించారు. ప్రతి ఒక్కరూ స్వయంగా చేయడం ద్వారా, ఎక్కడ, ఎలా, ఎంతసేపు కంప్రెషన్లు ఇవ్వాలో తెలుసుకున్నారు. ఇది తోటివారి ప్రాణాలను కాపాడేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.