రాజకీయ లబ్ధి కోసమే… విమర్శలు..!
1 min readకర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భరత్
- వైసీపీని వీడి..టీడీపీలో చేరిన యువత
కర్నూలు, పల్లెవెలుగు: తమ కుటుంబంపై ఇష్టానుసారంగా విమర్శలు చేసిన ఓ పెద్ద మనిషి ముందుగా వారి పార్టీ అధినేత, ఆయన చెల్లెలు ఏ ఏ పార్టీలో ఉన్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. నగరంలోని జొహరాపురంలో టిడిపి నేత జేమ్స్ ఆద్వర్యంలో వైసీపీకి చెందిన యువకుడు ఆనంద్ ఆ పార్టీని వీడి తన మిత్రులతో కలిసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టి.జి భరత్ వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా టి.జి భరత్ మాట్లాడుతూ రాజకీయ లబ్ది కోసం తమపై ఇష్టానుసారంగా మాట్లాడటం సరైంది కాదన్నారు. 2009 వరదల సమయంలో తాము కట్టుబట్టలతో ఇంటి నుండి బయటకు వచ్చినట్లు గుర్తు చేశారు. అప్పట్లో తమ తండ్రి టి.జి వెంకటేష్ అధికారులతో కూర్చొని ఈ ప్రాంత ప్రజలను వరదల నుండి బయట పడేసేందుకు ఎంత కష్టపడ్డారో తమ కంటే కూడా అప్పుడు ఉన్న కార్పోరేటర్లకు, అధికారులకు బాగా తెలుసన్నారు. ఇక కరోనా సమయంలో కర్నూలుతో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజలకు నిత్యవసర సరుకులు అందించడమే కాకుండా కర్నూలు ప్రభుత్వాసుపత్రికి ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు అందించి, కర్నూలు ప్రజల కోసం కోట్లాది రూపాయలు విలువ చేసే హైపో ద్రావణాన్ని ఉచితంగా అందజేసినట్లు తెలిపారు. తమపై విమర్శలు చేసే వాళ్లు ఆ పార్టీ అధినేత కుటుంబంలో ఉన్న పరిస్థితిని తెలుసుకొని మాట్లాడాలన్నారు. కర్నూలు ప్రజలకు మంచి చేయడమే తప్ప ఏనాడు కీడు చేయనిది తమ టి.జి కుటుంబమన్నారు. తమ గురించి వ్యక్తిగత విమర్శలు చేసే ముందు నిజానిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందన్నారు. కర్నూల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని ఊహించని విధంగా అభివృద్ధి చేస్తానన్నారు. పారిశ్రామికవేత్తగా ఉండటమే తన బలమని.. తాను ఎమ్మెల్యే అయితే కర్నూలుకు పరిశ్రమలు తీసుకొని వచ్చి ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించడమే కాకుండా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నారు. జొహరాపురం యువత వైసీపీని వీడి టిడిపిలో చేరడం సంతోషమని.. యువకులు సరైన నిర్ణయం తీసుకున్నారన్నారు. టిడిపిలో చేరిన వారిలో కలాకర్, భరత్, సతీష్, శీను, రంగ, గిరి, భూపతి, రాము, రాజ్ కుమార్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు తిమ్మోజీ, మోహన్, వెంకటయ్య, వెంకట రెడ్డి, శ్రీనివాసుగౌడ్, వెంకటేష్ గౌడ్, ఎల్లగౌడ్, చంద్రమోహన్, వినోద్ చౌదరి, శాంతమ్మ, చిట్టెమ్మ, తదితరులు పాల్గొన్నారు.