సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుందాం..
1 min read
మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
కర్నూలు: మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. స్థానిక టీజీవి కళాక్షేత్రంలో జరిగిన ఉగాది సంబరాలు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలు కొనసాగిస్తే ప్రపంచంలో భారతదేశం విశ్వ గురువుగా నిలుస్తుంది అన్నారు. ముస్లిం కంట్రీ అయినటువంటి ఇండోనేషియాలో ఎన్నో వారసత్వ కట్టడాలు దేవాలయాలు ఉన్నాయని వాటిని అక్కడివారు తమ మతం కాకపోయినప్పటికీ వారసత్వ సంపదగా కాపాడుకుంటున్నారని తెలిపారు. ఆ దేశ కరెన్సీ పై కూడా వినాయకుడి విగ్రహం ఉంటుందని దీనిని బట్టి మన పూర్వ సంస్కృతి ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చన్నారు. దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ ఇతర మతాలను గౌరవించుకుంటూ ముందుకు పోతే ఎటువంటి మతకలహాలు ఉండవని టీజీ వెంకటేష్ అన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా భాను ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం ఏర్పాటు చేశారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కవి సమ్మేళనం కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య టీజీవి కళాక్షేత్రం కార్యవర్గ సభ్యులు మహమ్మద్ మియా, యాగంటి ఈశ్వరప్ప, ఇనయతుల్లా తదితరులు పాల్గొన్నారు.
