పెరుగుతున్న సైబర్ మోసాలు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ట్రాఫిక్ సిఐ హెచ్చరిక
1 min read
పల్లెవెలుగు, కర్నూలు: పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ట్రాఫిక్ సిఐ. మన్సరుద్దీన్ హెచ్చరించారు.కెనరా బ్యాంక్ రీజనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైబర్ నేరాల అవగాహన ర్యాలీని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం నేరగాళ్లు పోలీసు, సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల పేరుతో ఫోన్లు చేసి, “డిజిటల్ అరెస్ట్” పేరుతో బెదిరిస్తూ, ఖాతాదారుల నుండి డబ్బులు కాజేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ అంటే, నేరగాళ్లు మిమ్మల్ని వీడియో కాల్లో బెదిరించి, మీరు ఏదో నేరం చేశారని నమ్మించి, డబ్బు గుంజడం. వీడియో కాల్స్ ద్వారా కూడా మోసాలకు పాల్పడుతున్నారు. ఓటిపి లు, నకిలీ వెబ్సైట్లు, సోషల్ మీడియా మోసాల ద్వారా కూడా ప్రజలను మోసగిస్తున్నారు. కావున ప్రజలు ఎటువంటి అనుమానాస్పద ఫోన్ కాల్స్, మెసేజ్‌లు వచ్చినా స్పందించవద్దని సూచించారు.ఏదైనా సైబర్ నేరం జరిగిన వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు లేదా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (cybercrime.gov.in) లో ఫిర్యాదు చేయాలని, మీ బ్యాంకును సంప్రదించాలని ఆయన తెలిపారు.కెనరా బ్యాంక్ రీజనల్ మేనేజర్ సుశాంత్ కుమార్ మాట్లాడుతూ, ఖాతాదారులకు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కెనరా బ్యాంకులో సురక్షితమైన సేవలు అందిస్తున్నామని, సురక్షితమైన పెట్టుబడుల కోసం కెనరా బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలని సూచించారు. ఆన్లైన్ బెట్టింగులు, ప్రైవేట్ వ్యక్తులు, మోసపూరిత చిట్‌ఫండ్ సంస్థల బారిన పడకుండా ఉండాలని సూచించారు.లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీ రామచంద్రరావు, ముఖ్య సూచనలు చేశారు:అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌ల పట్ల జాగ్రత్త వహించండి. మీ వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దు. మీ బ్యాంక్ ఖాతాను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి.ఏదైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి.కెనరా బ్యాంకు ఉద్యోగులు ర్యాలీ చేస్తున్న సందర్భంలో ప్రజలకు కెనరా బ్యాంక్ అందిస్తున్న వివిధ పథకాలపై అవగాహన కల్పిస్తూ ముందుకు సాగారు. సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ ఎస్టీబిసి కాలేజ్ గ్రౌండ్స్ నుండి ప్రారంభమై, ఐదు రోడ్ల జంక్షన్, పార్క్ రోడ్డు, డివీఆర్ హోటల్ మీదుగా కెనరా బ్యాంక్ రీజినల్ ఆఫీస్‌కు చేరుకుంది.కెనరా బ్యాంకు కర్నూలు రీజినల్ ఆఫీస్ డివిజనల్ మేనేజరు గౌతమ్, సురేష్ మరియు టౌన్ బ్రాంచ్ మేనేజర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
