కూతురి డైరెక్షన్.. తండ్రి యాక్షన్..
1 min readసినిమా డెస్క్: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ‘అన్నాత్తే’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నారు. ఈ భారీ కమర్షియల్ ఎంటర్ టైనర్ ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసిన రజినీకాంత్ హెల్త్ చెకప్ కోసం అమెరికా వెళ్లారు. ఈ సినిమా దాదాపుగా కంప్లీట్ అవడంతో ఆయన నెక్స్ట్ మూవీని ఎవరితో చేయబోతున్నారనే ఆశక్తి అందరిలో నెలకొంది. ఈ విషయంపై చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే పలువురు దర్శకులు ఆయనకి స్టోరీ నెరేషన్ ఇచ్చినట్టు టాక్. వారిలో రజినీకాంత్ కూతురు సౌందర్య కూడా ఉన్నారట. అంతేకాదు తన నెక్స్ట్ మూవీని కూతురు డైరెక్షన్ లోనే రజినీకాంత్ చేయబోతున్నారని కోలీవుడ్ సమాచారం. సౌందర్యకి డైరెక్షన్ కొత్తేమి కాదు. గతంలో రజినీకాంత్ ప్రధానపాత్రలో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ‘కొచ్చాడయాన్’ పేరుతో యానిమేషన్ మూవీ చేశారామె. కాకపోతే ఆ చిత్రం ఆశించిన ఫలితాన్నివ్వలేదు. నాలుగేళ్ల క్రితం ధనుష్ తో ‘విఐపీ 2’ తీసి మెప్పించిన ఆమె, ప్రస్తుతం ‘పొన్నియన్ సెల్వన్’ వెబ్ సిరీస్ కి క్రియేటివ్ డైరెక్టర్గా వ్యవహరిస్తోంది. అయితే తండ్రితో సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాలనే ఆమె కోరిక ఇంకా అలాగే ఉందట. గత కొన్నేళ్లుగా ఇందుకోసం ప్రయత్నిస్తున్న సౌందర్య, ప్రముఖ రచయితలతో కలిసి స్క్రిప్ట్ కూడా రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఇదొక ఫాంటసీ సబ్జెక్ట్ అని, దీన్ని నిర్మించేందుకు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఆసక్తి చూపిస్తోందని కూడా టాక్. రజినీ అమెరికా నుండి తిరిగి రాగానే ఈ ప్రాజెక్ట్ పై మరింత క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు.