తెలంగాణలో తగ్గుతున్న సంతానసాఫల్య రేటు
1 min read
నోవా ఐవీఎఫ్ ఆధ్వర్యంలో సంతాన సాఫల్య సదస్సు
దీనిపై ప్రభుత్వ వర్గాల్లోనూ ఆందోళన
అండాల ఫ్రీజింగ్‌పై పెరుగుతున్న అవగాహన
పిల్లలను కనే అంశాన్ని ఆలస్యం చేయొద్దు
హైదరాబాద్, న్యూస్ నేడు: తెలంగాణలో సంతానోత్పత్తి, సంతాన సాఫల్య రేటు గణనీయంగా పడిపోతోంది. ఇది వైద్య నిపుణులు, ప్రభుత్వ ప్రతినిధులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. జీవనశైలి మార్పులు, ఆలస్యంగా గర్భం దాల్చడం, పురుషుల్లో వంధ్యత్వం, జీవితంలో పెరుగుతున్న ఒత్తిడి లాంటి అంశాలు స్త్రీపురుషులలో సంతానరాహిత్య రేటు పెరగడానికి కారణం అవుతున్నాయి. ఈ సమస్యలపై చర్చించేందుకు, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్‌టీ)లో ఆధునిక పరిణామాల గురించి తెలుసుకునేందుకు నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ, ద ఆబ్స్టెట్రిక్ అండ్ గైనకలాజికల్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నగరంలోని తాజ్ కృష్ణ హోటల్ లో సంతాన సాఫల్య సదస్సు నిర్వహించారు. నగరవ్యాప్తంగా ఉన్న గైనకాలజిస్టులు, ఫెర్టిలిటీ నిపుణులు సుమారు 500 మందికి పైగా దీనికి హాజరై, ఈ సమస్య లోతుల గురించి చర్చించారు.
మారుతున్న తీరుతెన్నులు
సంతానరాహిత్య కేసుల్లో తీరుతెన్నులు ఇటీవల మారుతున్నాయని బంజారాహిల్స్ నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీకి చెందిన సంతానసాఫల్య నిపుణురాలు డాక్టర్ హిమదీప్తి తెలిపారు. “ఒక దశాబ్దం క్రితం చాలావరకు పీసీఓడీ, ఎండోమెట్రియోసిస్ ఇన్ఫెక్షన్, అండాల సంఖ్య తగినంతగా లేకపోవడం కారణాలుగా ఉండేవి. కానీ ఇప్పుడు చాలామంది గర్భధారణను ఆలస్యం చేస్తున్నారు. మహిళలు 35-40 ఏళ్లు దాటాక గర్భధారణ ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ, 35 ఏళ్లు దాటాక అండం నాణ్యత, అండాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతాయి. అయితే, ఇప్పుడు చాలామంది ఎగ్ ఫ్రీజింగ్‌పై అవగాహన పెంచుకుంటున్నారు. మాకు ప్రతియేటా 50-100 విచారణలు దీనికోసం వస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం ఈ సంఖ్య చాలా నామమాత్రంగా ఉండేది. ఇప్పుడు పెళ్లికాని యువతులు కూడా ఎగ్ ఫ్రీజింగ్ గురించి తెలుసుకోవడానికి ముందుకొస్తున్నారు” అని డాక్టర్ హిమదీప్తి తెలిపారు.
పురుషుల్లో పెరుగుతున్న వంధ్యత్వం:
కూకట్‌పల్లి నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీకి చెందిన డాక్టర్ సరోజ కొప్పల మాట్లాడుతూ, “పురుషుల్లో వంధ్యత్వం పెరుగుతున్నా దాన్ని చాలా సందర్భాల్లో గుర్తించడం లేదు. వీర్యానికి సంబంధించిన అంశాలు గణనీయంగా పడిపోతున్నాయి. ఊబకాయం, ధూమపానం, మద్యపానం, ఇతర జీవనశైలి కారణాల వల్ల ఇలా జరుగుతోంది. నయం చేయగలిగే కారకాలను గుర్తిస్తే పురుషులకు పిల్లల విషయంలో ఇబ్బంది ఉండదు. వాళ్లలో వంధ్యత్వం ఇక నయం చేయలేనిదిగా మారినప్పుడు ఇక అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్‌టీ) అవసరం అవుతుంది” అని తెలిపారు. 40 ఏళ్లు దాటిన తర్వాత పురుషుల్లో వీర్యం నాణ్యత అంతగా ఉండదని, అది పిల్లల ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుందని ఆమె సూచించారు. వీర్యంలో అసాధారణతలు ఉన్నాయంటే ఏవో వ్యాధులు ఉన్నట్లు కూడా గుర్తించాలని చెప్పారు. కంటిన్యువస్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీఎంఈ)లో పాల్గొన్న సంతానసాఫల్య నిపుణులంతా కూడా పిల్లలను కనే విషయాన్ని ఆలస్యం చేయకూడదని నొక్కి చెప్పారు. ఒకవేళ పిల్లలు ఆలస్యంగా కావాలనుకుంటే ముందుగానే పురుషులు, మహిళలు తమ వీర్యం, అండాలను ఫ్రీజ్ చేయించుకోవాలి. ఇద్దరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాలని, సంతానోత్పత్తి స్క్రీనింగ్ చేయించుకోవాలని, గర్భధారణలో ఇబ్బందులు ఎదురైతే త్వరగా వైద్యుల సలహా తీసుకోవాలని వారు కోరారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు, FIGO కోశాధికారి డాక్టర్ శాంత కుమారి, OGSH (ప్రసూతి & గైనకాలజికల్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్ (OGSH)) కార్యదర్శి డాక్టర్ మంజుల రావు హాజరయ్యారు. నోవా IVF ఫెర్టిలిటీ హైదరాబాద్‌లోని ఇతర ముఖ్య సంతానోత్పత్తి నిపుణులు బంజారా హిల్స్‌కు చెందిన డాక్టర్ దుర్గా వైట్ల మరియు LB నగర్‌కు చెందిన డాక్టర్ దివ్య రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.పునరుత్పత్తి ఆరోగ్యంపై అవగాహనను వ్యాప్తి చేయడానికి, అత్యాధునిక సంతానసాఫల్య చికిత్సలు అందించడానికి నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ కట్టుబడి ఉంది. వంధ్యత్వానికి చికిత్సలలో తాజా పరిణామాలు, సమస్యలు, పరిష్కారాలపై చర్చించేందుకు ఈ రంగంలోని నిపుణులందరినీ ఒకచోటకు తీసుకురావడంలో ఈ సీఎంఈ ఒక మంచి ముందడుగు.