డబ్బు సంపాదన కోసం రాజకీయాల్లోకి వచ్చే స్వార్థపరులను ఓడించండి..
1 min readకర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భరత్
10వ వార్డులో టిడిపి కార్యాలయం ప్రారంభించిన టి.జి భరత్, జనసేన అసెంబ్లీ ఇంచార్జి అర్షద్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : డబ్బు సంపాదన కోసం రాజకీయాల్లోకి వస్తున్న నాయకులను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని 10వ వార్డు పింజరి వీధిలో స్థానిక నాయకులు ఏర్పాటుచేసిన వార్డు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని.. జనసేన అసెంబ్లీ ఇంచార్జి అర్షద్‌తో కలిసి టి.జి భరత్ ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిసారి ఎన్నికల సమయంలో కులం, మతం అంటూ కొందరు ప్రజల్ని మభ్యపెడుతున్నారన్నారు. అయితే ప్రజలు కుల, మత రాజకీయాలు చేసే వ్యక్తుల ఉచ్చులో పడొద్దని ఆయన కోరారు. తమ కుటుంబం డబ్బు కోసం కాకుండా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లో ఉందన్నారు. కర్నూల్లో ఎవ్వరిని అడిగినా తన తండ్రి టి.జి వెంకటేష్ గురించి మంచిగానే చెబుతారన్నారు. ఎందుకంటే ఆయన గురించి చెడుగా చెప్పేందుకు ఏమీ లేదన్నారు. తమకు, ఇతర నాయకులకు ఉన్న తేడాను ప్రజలు గుర్తించాలని భరత్ కోరారు. ఇక కర్నూల్లో పారిశుధ్యం పడకేసిందన్నారు. పరిశుభ్రత లేక ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. ప్రజల నుండి పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ వీధులను పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. సరైన నాయకుడు లేనందునే ప్రజలకు ఈ కష్టాలు వచ్చాయన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి, కర్నూల్లో తాను ఎమ్మెల్యే అయితే ప్రజలందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటారని భరోసా ఇచ్చారు. స్థానికంగా పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. అందరికీ అవకాశం ఇచ్చినట్లే తనకు కూడా ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుంటుందన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన అసెంబ్లీ ఇంచార్జి అర్షద్ మాట్లాడుతూ ఎన్నికల్లో కులం, మతం చూడొద్దన్నారు. తనతో సహా కర్నూల్లో ఉన్న ముస్లీం నాయకులు.. హఫీజ్ ఖాన్‌కి మద్దతు ఇస్తే.. ఆయన ముస్లీం మైనార్టీలందరితో పాటు ప్రజలను సైతం మోసం చేశారన్నారు. ప్రజలందరూ వచ్చే ఎన్నికల్లో స్వార్థపరులను నమ్మొద్దని.. నిజాయితీగల టి.జి భరత్‌ను గెలపించాలన్నారు. టిడిపి, జనసేన ప్రభుత్వంలో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు జియా, కలీం, హమీద్, సల్మాన్, ఇమ్రాన్, ఇంజార్, మహాలక్ష్మి, సాలీబీ, హైమావతి, మెహబూబ్, ఇమ్రాన్, సులేమాన్, మోయిన్, జనసేన నేతలు నాగరాజు, అనిత శ్రీ, తదితరులు పాల్గొన్నారు.