35 చోరీ కేసుల ముద్దాయి అరెస్టు
1 min read– తెలుగు రాష్ట్రాల్లో వరుస దొంగతనాలు
– బంగారం, వెండి, నగదు స్వాధీనం
– వివరాలు వెల్లడించిన కర్నూలు పట్టణ డీఎస్పీ మహేష్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు : తెలుగు రాష్ట్రాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముద్దాయిని కర్నూలు టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. టూటౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టౌన్ డీఎస్పీ మహేష్ వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ చెక్ పోస్టు వద్ద పీ.జే.ఆర్. విగ్రహం దగ్గర రహమత్ నగర్లో నివాసం ఉంటున్న వారణాసి ఆనంద్ అనే వ్యక్తి తాళం వేసిన ఇంటినే టార్గెట్ చేసుకుని… చోరీలకు పాల్పడుతున్నాడు. మే 16న కర్నూలు నగరంలోని ఎన్.ఆర్.పేటకు చెందిన యలమంచి రత్న అనే ఆమె భర్తకు ఆరోగ్యం సరిగా లేకపోతే డాక్టర్ వద్ద చికిత్స చేయించి.. ఇంటికి వచ్చేలోపు దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేసింది. బెడ్రూంలోని బీరువాలో బంగారు గొలుసు, ఉంగరం, వెండి వస్తువులు గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించారని , వాటి విలువ రూ.1.25 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొంది. కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం సుంకేసుల రోడ్డు ప్రకాష్ నగర్ రైల్వే బ్రిడ్జి వద్ద ముద్దాయి సంచరిస్తుండగా ..అతనిని చోరీకి పాల్పడిన వ్యక్తిగా గుర్తించి అరెస్టు చేశారు.
ముద్దాయిపై టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఒకటి, త్రీటౌన్ లో రెండు కేసులు నమోదయ్యాయి. మూడు కేసులకు సంబంధించి అతని వద్ద ఒక గోల్డ్ చైన్, ఒక గోల్డ్ రింగ్, 8 గ్రాముల తూకం గల 3 జతల బంగారు కమ్మలు, రింగ్, 2 కేజీల 100 గ్రాముల వెండి సామగ్రి , లక్ష నగదు స్వాధీనం చేసుకుని, ముద్దాయిని రిమాండ్‌కు పంపారు. ముద్దాయిపై ఏపీ, టీఎస్‌లో మొత్తం 35 చోరీ కేసులు ఉన్నాయని కర్నూలు డీఎస్పీ మహేష్ వివరించారు. ముద్దాయిని చాకచక్యంగా వ్యవహరించి త్వరగా పట్టుకున్న క్రైమ్ పార్టీ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ చెంచన్న, కానిస్టేబుల్స్ రవి కుమార్, మహేంద్ర, శ్రీనివాసులునును DSP మహేష్ అభినందించారు.