డీహెచ్‌పీఎస్ డైరీ ఆవిష్కరించిన డేగా ప్రభాకర్
1 min readపల్లెవెలుగు వెబ్,ఏలూరు : దళిత శ్రేణులు నిత్యం కొనసాగిస్తున్న పోరాటాలు.. ఆందోళనలకు ఉద్యమ కరదీపికగా ఉపయోగపడాలని సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ అన్నారు. దళిత హక్కుల పోరాట రాష్ట్ర సమితి ముద్రించిన 2022 డైరీని స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనం లో డేగా ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ నవభారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ దళితులకు రాజ్యాంగం లో హక్కులు పొందుపరచారని, స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు కావస్తున్నా దళితులు అణగారిన వర్గాలు గానే కొనసాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు గతంలో అమలు చేశారని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పథకాలను తుంగలో తొక్కి కొత్త కొత్త పథకాల పేరుతో ఆచరణ సాధ్యం కాని సంక్లిష్ట పరిస్థితులలోకి నెట్టారని ఆరోపించారు. దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కళింగ లక్ష్మణరావు మాట్లాడుతూ 2006 సంవత్సరం నుండి దళిత సమస్యలు, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు అమలు గురించి దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తుందన్నారు. ప్రభుత్వ పథకాల అమలు తీరు గురించి డైరీలో పొందుపరచడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం దళితులకు సంబంధించి 15 పథకాలను రద్దు చేసిందని ఆరోపించారు. దళితులకు అనేక పథకాలు అమలు చేస్తున్నామని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నా ఆచరణలో శూన్యం అన్నారు. 16 శాతం ఉన్న దళితులకు ఒక సంక్షేమ పథకం కూడా అమలు చేయలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దళితులకు సంక్షేమ పథకాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, ఉల్లెంకుల జయకృష్ణ,బుగ్గల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.