రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూని..
1 min readటీడీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజాస్వామ్యం ఖూని అయిందని టీడీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలంసాహ్ని… ఈనెల 1న పరిషత్ ఎన్నికలు షెడ్యూలు ప్రకటించి.. 2వ తేదీన అఖిలపక్ష సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్ మెప్పు కోసం.. నిబంధనలు తుంగలో తొక్కి ఎన్నికల తేదీలను ప్రకటించడం దారుణమన్నారు. ఒక పక్క పరిషత్ ఎన్నికల నిమిత్తమై 13 నెలల క్రిత్తం నోటిఫీకేషన్ ఇవ్వగా వైసీపీ నాయకులు అధికారాన్ని అడ్డు పెట్టుకుని.. ప్రతిపక్ష పార్టీల వారిని భయభ్రాంతులకు గురి చేసి ఎక్కువ చోట్ల ఏకగ్రీవాలు చేసుకున్నారని, ఈ ఎన్నికలకు సంబంధించి హై కోర్టులో కేసులు ఉన్నాయని, అలాంటప్పుడు ఎన్నికల అధికారి తేది ప్రకటించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. అంతేకాగ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు నాలుగు వారాల నుండి కోడ్ అమలులో ఉండేటట్లు జాగ్రత్తవహించాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలున్నప్పటికిని వాటిని తుంగలో తొక్కిన యస్ ఈ సి తనకు పదవిని కట్టబెట్టిన ముఖ్యమంత్రి మెప్పుకోసం పరిషత్ ఎన్నికలను ప్రకటించడం భావ్యం కాదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను మొత్తం దేశానికి తెలియజేయాలన్న మెజార్టీ పార్టీ నాయకుల సూచనల మేరకు టీడీపీ జాతీయ అధ్యక్షులు,మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పరిషత్ ఎన్నికలను బహిష్కరించారని, కనుక కార్యకర్తలు నాయకులు ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేకుండా ఎన్నికలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, పార్లమెంట్ యువత ఆధ్యక్షులు యస్.ఆబ్మాస్ , కర్నూలు పార్లమెంట్ సాంస్కృతిక విభాగపు జిల్లా అధ్యక్షులు పి.హనుమంతరావు చౌదరి, నాయకులు రవికుమార్, మంచాలకట్ట బాస్కరరెడ్డి, పెరపోగు రాజు, చంద్రకాంత, లక్ష్మిరెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు.